కుప్పం.....టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోట. 1989 నుంచి మొన్న 2019 వరకు వరుసగా ఏడు సార్లు చంద్రబాబు  తిరుగులేని విజయాలు సాధించారు. అలాంటి చంద్రబాబు అడ్డాపై ఇప్పుడు సీఎం జగన్ కన్ను పడింది. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు గ్రామ పంచాయితీగా ఉన్న కుప్పంని మున్సిపాలిటీ చేయడానికి నిర్ణయించారు. కుప్పంతో కలుపుకుని మొత్తం రాష్ట్రంలోని 50 గ్రామ పంచాయితీలని మున్సిపాలిటీలుగా చేస్తూ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.


అయితే ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు ఆధిక్యాన్ని తగ్గించేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్న ఎన్నికల్లోనే జగన్...చంద్రబాబు ఆధిక్యాన్ని తగ్గించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీ అభ్యర్ధి చంద్రమౌళిపై 47 వేల మెజారిటీతో గెలుపొందారు. కానీ మొన్న ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో గెలిచారు. దాదాపు 17 వేల మెజారిటీ తగ్గింది. ఇక ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ చేసి, అభివృద్ధి చేయాలని జగన్ నిశ్చయించుకున్నారు.


చంద్రబాబు చేయని అభివృద్ధి, తాను చేశానని చెప్పేందుకు జగన్ సిద్ధమయ్యారు. అందుకే కుప్పం మున్సీపాలిటీకి భారీ స్థాయిలో నిధులు విడుదల చేయాలని చూస్తున్నారు. మామూలుగా అయితే గ్రామ పంచాయితీకి ఎక్కువ నిధులు రావు. అదే మున్సిపాలిటీ అయితే నిధులు గట్టిగానే వస్తాయి. పైగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడం వల్ల కుప్పంకి ఎక్కువ నిధులు మంజూరు చేయొచ్చు. దీని వల్ల రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా సత్తా చాటొచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నారు.


చంద్ర‌బాబు ఇన్నేళ్లు సీఎంగా ఉన్న కుప్పం పులివెందుల త‌ర‌హాలో అభివృద్ధి చెంద‌లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కుప్పంని కైవసం చేసుకుంటే , వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు చెక్ పెట్టొచ్చని జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. చూడాలి మరి జగన్ వ్యూహం ఏ మేర వర్కౌట్ అవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: