తెలంగాణ‌లో ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ స‌మ్మె ఊహించ‌ని మ‌లుపు తీసుకోనుందా? స‌మ్మె విర‌మ‌ణ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయా? అంటే తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్ర‌క‌ట‌న చేయ‌డం, దానికి ఆర్టీసీ జేఏసీ సానుకూలంగా స్పందించ‌డం, ప్ర‌భుత్వం సైతం ఒక‌డుగు వెన‌క్కిత‌గ్గ‌డం ఈ అంచ‌నాలు వ్య‌క్త‌మ‌య్యేందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి.


పరిస్థితులు చేయిదాటక ముందే ఆర్టీసీ యూనియన్‌ నేతలు కార్మికులను సమ్మె విరమింపజేసి చర్చలకు సిద్ధం కావాలని టీఆర్ఎస్ పార్టీ తరపున టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు సూచించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి అని కే కేశవరావు పేర్కొన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపదు అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ``ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం గతంలో గొప్పగా పరిష్కరించింది. 44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. ఆర్టీసీని ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అద్దె బస్సులు, ప్రయివేటు స్టేజీ క్యారేజీల విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి.  ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది ఎన్నికల ప్రణాళికలో చేర్చలేదు. ఆర్టీసీయే కాదు ఏ ప్రభుత్వ రంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మేనిఫెస్టోలో పేర్కొనలేదు`` అని కేశవరావు స్పష్టం చేశారు.


కాగా, కేకే మధ్యవర్తిత్వాన్ని ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే స్వాగతించింది. మంగ‌ళ‌వారం నాటికి తమ అభిప్రాయాన్ని చెప్పాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్ నేతలతో చర్చలు జరిపేందుకు టీఆర్‌ఎస్ పార్టమెంటరీ పార్టీ నేత కేకే ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమైనట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారానికి టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకురావ‌డం...ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చిందంటున్నారు. సమ్మె విరమించి చర్చలకు రావాలని కార్మికులకు కేకే చేసిన‌ సూచన ఏ మేర‌కు ఫ‌లితం ఇస్తుందో....ఇరు ప‌క్షాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: