ఇప్ప‌టికే ఓట‌మి భారంతో కుంగి పోతున్న టీడీపీకి జంపింగ్‌ల దెబ్బ భారీగా త‌గ‌ల‌నుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది కీల‌క నాయ‌కులు ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి దెబ్బ‌తో పార్టీ మారిపోయిన ప‌రిస్థితి చూశాం. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవ‌రూ కూడా ఆ దిశ‌గా ఆలోచ‌న చేయ‌లేదు. కానీ, ఇప్పుడు కీల‌క నాయ‌కుడు, చంద్ర‌బాబును విడిచి పెట్టి వెళ్లేది లేద‌ని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి చుట్టూ ఇప్పుడు జంపింగ్ వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. రాజ‌కీయాల్లో ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు.


ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా గెలుపు గుర్రం ఎక్కుతాడ‌నే పేరున్న ఆ నాయ‌కుడే విశాఖ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సొంతం చేసుకున్న గంటా శ్రీనివాస‌రావు. టీడీపీలో ప్రారంభించిన రాజ‌కీయ‌ ప్ర‌స్థానం..  త‌ర్వాత ప్ర‌జారాజ్యం, ఆ త‌ర్వాత కాంగ్రెస్‌, మ‌ళ్లీ 2014 ఎన్నిక‌లకు ముందు టీడీపీలోకి వ‌చ్చి చేరింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అన‌కాప‌ల్లి, భీమిలి వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా విజ‌యం సాధించారు. ఏ పార్టీలో ఉన్నా.. ఎక్క‌డ నుంచి పోటీ చేసినా.. ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే పేరు పొందారు.


ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ భారీ ఎత్తున క‌నిపించినా.. కూడా గంటా మాత్రం విజ‌యం సాధించారు. చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రిగా చేసిన గంటా గ‌తంలో కాంగ్రెస్‌లోనూ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన గంటాకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక‌, ఇప్పుడు ఆయ‌న పార్టీ మారుతున్నార‌నే వ్యాఖ్య‌లు, వ్యాఖ్యానాలు జోరుగా వినిపిస్తుండ‌డం కొత్త‌కాదు. 2019 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కొంద‌రుఅనుచ‌రులను వెంట‌బెట్టుకుని ఆయ‌న విదేశాల‌కు వెళ్లిన ద‌గ్గ‌ర నుంచి ఆయ‌న టీడీపీకి రాం రాం చెబుతార‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే, త‌ర్వాత ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. తాను చంద్ర‌బాబును విడిచి పెట్టేది లేద‌న్నారు. పైగా వైసీపీలోకి వెళ్లేది కూడా లేద‌ని చెప్పారు.


అయితే, ఇప్పుడు విశాఖ భూ కుంభ‌కోణానికి సంబంధించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం కీల‌క నేత‌ల అరెస్టుకు రంగం సిద్ధం చేసింద‌న్న నేప‌థ్యంలో గంటా పార్టీ మార‌పోయేందుకు రెడీ అయ్యార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అయితే, ఆయ‌న నేరుగా బీజేపీలోకి వెళ్తార‌ని అంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో బీజేపీ అయితేనే త‌న‌కు ఉప‌యోగంగా ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి అత్యంత ర‌హ‌స్యంగా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని, కేంద్ర బీజేపీ పెద్ద‌ల నుంచి కూడా ఈయ‌న‌కు హామీ ల‌భించింద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే జంప్ చేసేందుకు గంటా స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడ‌నే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: