కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. హ‌ర్యాన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సభల్లో మాట్లాడారు. కీలక అంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. బ్రిటీష‌ర్ల త‌ర‌హాలో బీజేపీ దేశాన్ని విభ‌జిస్తోంద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. హ‌ర్యానాలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్న రాహుల్ ఈ కామెంట్ చేశారు. అంత‌కుముందు రోజు మ‌హారాష్ట్రలో మాట్లాడుతూ.... తమకు పని కల్పించాలని యువత కోరితే చందమామను చూడాలని కేంద్ర ప్రభుత్వం కబుర్లు చెబుతున్నదని ఇటీవల చంద్రయాన్-2 ప్రయోగాన్ని గుర్తు చేస్తూ వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు కల్పించాలని యువత కోరుతుంటే 370 అధికరణం (రద్దు) గురించి, జాబిల్లి గురించి సర్కార్ కబుర్లు చెబుతుంది. కానీ దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై మాత్రం మౌన ముద్ర వహిస్తుంది అని మండిపడ్డారు. చంద్రుడిపైకి ఇస్రో ఉపగ్రహాన్ని ప్రయోగించినంత మాత్రాన మహారాష్ట్రలోని పేదల కడుపు నిండదన్నారు. 


నిజ‌మైన స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు మోదీ జిత్తులు వేస్తున్నార‌ని రాహుల్ అన్నారు.  భార‌త్ భిన్న‌త్వాన్ని చాటే దేశ‌మ‌ని, వివిధ మ‌తాల‌, కులాల‌, వ‌య‌సువారున్న దేశ‌మ‌ని, కాంగ్రెస్ పార్టీ అంద‌రికీ చెందుతుంద‌ని, కానీ బీజేపీ మాత్రం బ్రిటీష‌ర్ల త‌ర‌హాలో దేశాన్ని విభ‌జిస్తోంద‌ని రాహుల్ విమ‌ర్శించారు. ప్ర‌ధాని మోదీ మ‌న్‌కీ బాత్ గురించి మాట్లాడుతుంటార‌ని, నేను మాత్రం కామ్ కీ బాత్ గురించి చెబుతాన‌న్నారు. మేం త‌ప్పుడు వాగ్దానాలు చేయ‌మ‌ని, వాగ్ధానం చేసిన వాటిని మాత్రం నెర‌వేస్తామ‌న్నారు. వాళ్ల‌కు వాళ్లే దేశ‌భ‌క్తులు అని చెప్పుకుంటున్నారు, ఒక‌వేళ వాళ్తు దేశ‌భ‌క్తులే అయితే, మ‌రెందుకు దేశ సొత్తును అమ్ముతున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌జారంగ సంస్థ‌ల‌ను పెట్టుబ‌డీదారుల‌కు ఎందుకు అమ్మేస్తున్నార‌న్నారు.


కేవలం 15 మంది సంపన్నులకు మాత్రమే రూ. 5.5 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని రాహుల్ ఆరోపించారు. ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీలో 2017 డోక్లాం ప్రతిష్ఠంభన గురించి ప్రశ్నించారా? అన్న సంగతి దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నారన్నారు. రైతుల ఉద్యోగాల కొరతపైనా మీడియా నిశ్శబ్దంగా ఉంది. సంపన్నులకు రుణమాఫీపై మీడియా మౌనం వహిస్తున్నది. మీడియా సంస్థలకు సంపన్నులే సారథ్యం వహిస్తున్నారు అని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: