సెప్టెంబర్ నెలకుగాను జీఎస్టీ వసూళ్లు 19 నెలల కనిష్ఠ స్థాయి రూ.91,916 కోట్లకు పడిపోవడంతో కేంద్ర‌ ప్రభుత్వం కీల‌క చ‌ర్య‌లు చేప‌డుతోంది. జీఎస్టీ వసూళ్లను పెంచడానికి పన్నుల పరిధిని పెంచడానికి, ఎగవేతలను నియంత్రించడానికి గతవారంలో కేంద్రం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.  కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి ప్యానెల్ కమిటీ మంగళవారం తొలిసారిగా సమావేశం కాబోతున్నది. 15న కమిటీ తొలిసారిగా సమావేశం కాబోతున్నదని, ఈ కమిటీ తన తుది నివేదికను సమర్పించడానికి పదిహేను రోజులు గడువు వచ్చినట్లు జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ రాజన్ తెలిపారు. 


పలు రాష్ర్టాలకు చెందిన జీఎస్టీ కమిషనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిసి 12 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీ..జీఎస్టీ పన్నుల విధానంపై ప్రధానంగా చర్చించి ఒక నివేదికను సమర్పించనుంది. జీఎస్టీ పన్నుల విధానంలో నూతన సంస్కరణలు ప్రవేశపెట్టడం, ఇతర విషయాలను క్రోడీకరించి నివేదికను ఈ నెల చివర్లో కేంద్రానికి అందించనుంది. ఈ కమిటీలో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లకు చెందిన జీఎస్టీ కమిషనర్లతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జీఎస్టీ ప్రధాన కమిషనర్, జాయింట్ కార్యదర్శి(రెవెన్యూ) అధికారులు ఉన్నారు.జూలై 1, 2017 నుంచి అమలులోకి వచ్చిన నాటి నుంచి జీఎస్టీపై సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. 


వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల సెప్టెంబర్‌లో 19 నెలల కనిష్ఠాన్ని తాకుతూ రూ.91,916 కోట్లకే పరిమితమైయ్యాయి. దిగజారిన వినియోగ సామర్థ్యంతో మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రానికి ఈ వసూళ్లు దర్పణం పడుతున్నాయి. నెలసరి జీఎస్టీ వసూళ్లు క్షీణించడం వరుసగా ఇది రెండో నెల కావడం గమనార్హం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.91,916 కోట్లుగా ఉంటే, అంతకుముందు నెల ఆగస్టులో రూ.98,202 కోట్లుగా ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో రూ.94,442 కోట్లుగా ఉన్నాయి. ఈసారి జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.16,630 కోట్లు, ఎస్జీఎస్టీ వాటా రూ.22,598 కోట్లు, ఐజీఎస్టీ వాటా రూ.45,069 కోట్లు (దిగుమతులపై సేకరించినదే రూ.22,097 కోట్లు), సెస్సు రూ.7,620 కోట్లు (దిగుమతులపై వేసినదే రూ.728 కోట్లు)గా ఉన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: