సుప్రీం కోర్టులో అయోధ్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. అయోధ్య పరిసరాల్లో డిసెంబర్ 10 వరకు 144 సెక్షన్ విధించారు. వివాదాస్పద స్థలం తమదేనని సున్నీ వక్ఫ్ బోర్డ్ వాదనలు వినిపించింది. ఈ స్థలం హిందూ పార్టీలకు చెందినదని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. అయోధ్య కేసులో నవంబర్ 17న తుది తీర్పు వెలువడనుంది. 


దశాబ్దాల సమస్యగా ఉన్న అయోధ్య కేసులో.. విచారణ చివరి అంకానికి చేరుకుంది. అక్టోబర్ 17తో వాదనలు ముగిస్తామని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. వారం రోజుల దసరా సెలవుల తర్వాత రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసులో విచారణ జరిపింది. సున్నీ వక్ఫ్ బోర్డ్ తరపున లాయర్ రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. వివాదాస్పద స్థలం తమదేనని, హిందూ పార్టీలకు చెందినదనడానికి ఎలాంటి ఆధారాల్లేవని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఉన్న గుడిని కూల్చేసి, మసీదు కట్టారనడానికి కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర కూడా రుజువుల్లేవన్నారు. 


అయోధ్య కేసు విచారణ తుది దశకు చేరిన తరుణంలో.. అయోధ్య పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 10 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. డ్రోన్లతో సినిమా షూటింగులు కూడా బ్యాన్ చేశారు. నవంబర్ 17న అయోధ్య కేసులో తుది తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించడంతో.. ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ విధించారు. నలుగురి కంటే ఎక్కువగా గుమిగూడితే అరెస్ట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. 


అయోధ్య కేసులో కోర్టు వెలుపల పరిష్కారానికి మధ్యవర్తిత్వ కమిటీని నియమించినా ఫలితం రాలేదు. దీంతో తాను పదవీ విరమణ చేసే నవంబర్ 17నే తుది తీర్పు ఇవ్వాలని సీజేఐ రంజన్ గొగోయ్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి అయోధ్య కేసు దేశంలో ఉత్కంఠ రేపుతోంది. తీర్పు ఎలా ఉండబోతోందో అని ఆసక్తి నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: