రాజకీయాలన్నాక ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజం. గెలుపుతో పాటు ఓటమిని కూడా సమానంగా తీసుకుంటేనే హుందాగా ఉంటుంది. కానీ చంద్రబాబునాయుడు విషయంలో హుందాతనం మాటలకు మాత్రమే పరిమితమవుతోంది.  మొన్నటి ఎన్నికల్లో తిన్న చావుదెబ్బతో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబులో ఎంత కడపుమంట ఉందో ఎప్పటికప్పుడు బయటపడిపోతోంది. అయితే అది ఎప్పటికి తగ్గుతుందన్నదే ప్రశ్నలాగ మిగిలిపోతోంది.

 

తాజాగా రెండు రోజుల నెల్లూరు పర్యటనలో ఆ విషయం మరోసారి బయటపడింది. నెల్లూరు టౌన్లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడినపుడు జగన్ పై చంద్రబాబుకు మనసులో ఎంత కసుందో అర్ధమైపోయింది. విషయం ఏమిటంటే చంద్రబాబు చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా కొత్తది లేదు, వాటికి  ఆధారాలూ లేవు.

 

కోడెల ఆత్మహత్యకు జగన్ ప్రభుత్వమే కారణమట. తప్పుడు కేసులు పెట్టటం వల్లే మానసికంగా కృంగిపోయిన కోడెల ఆత్మహత్య చేసుకున్నారట. రాష్ట్రంలో కొత్తగా జే ట్యాక్స్ అమలవుతోందని ఆరోపించారు. గతంలో అమలైన కే ట్యాక్స్ కు బదులుగా చంద్రబాబు కావాలనే జే ట్యాక్స్ అని ఆరోపిస్తున్న విషయం తెలిసిపోతోంది.

 

ఇక పోలీసు డ్రస్సును జగన్ అపవిత్రం చేసేస్తున్నట్లు మండిపోయారు. పోలీసు డ్రస్ చాలా పవిత్రమైనదన్న విషయం చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే గుర్తుకొచ్చింది.  తాను సిఎంగా ఉన్నపుడు పోలీసులను ఎంత హీనంగా వాడుకున్నది పాపం మరచిపోయినట్లున్నారు. సోషల్ మీడియాలో తనతో పాటు తన కుటుంబసభ్యులపై వైసిపి వాళ్ళు ఎన్ని పోస్టింగులు పెట్టినా చాలా హుందాగా వ్యవహరించారో చెప్పుకున్నారు.

 

సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టినందుకు ఎంతమంది నెటిజన్లను చంద్రబాబు, నారా లోకేష్ కేసులు పెట్టించి జైళ్ళకు పంపారో అందరికీ గుర్తుంది. అలాంటిది తాను హుందాగా వ్యవహరించినట్లు ఆయన చెప్పుకుంటే నమ్మేదెవరు ?  మంచి పోస్టింగుల కోసం టిడిపి కార్యకర్తలు, జనాలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసు అధికారులను వదలేది లేదని హెచ్చరించారు చంద్రబాబు.  మొత్తం మీద మొదటి రోజు చంద్రబాబు చేసిన ఆరోపణలతో  జగన్ పై ఎంత కడుపుమంటుందో అర్ధమైపోయింది. కాబట్టి ఇక మిగిలిన కాలమంతా కూడా చంద్రబాబు వైఖరి ఇలాగే ఉంటుందని కూడా తెలిసిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: