ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల నిర్వహణను అక్కడి ప్రభుత్వమే పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది.  ప్రభుత్వమే అక్కడ మద్యం దుకాణాలను నిర్వహిస్తూ.. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చుకుంటోంది.  బెల్ట్ షాపులు ఎత్తివేశారు.  అటాచ్మెంట్ రూమ్ లను తీసేశారు.  ఎవరికైనా సరే మూడు బాటిల్స్ కంటే ఎక్కువ ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు.  మూడు బాటిళ్లు మాత్రమే మద్యం తీసుకోవాలి.  అంతకు మించి ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవు.  దీంతో మూడు బాటిళ్ల మద్యం కోసం భారీ క్యూలు కడుతున్నారు.  


అక్టోబర్ 1 ముందు వరకు మద్యం దుకాణాలను నిర్వహించిన షాప్ యజమానులు ఇప్పుడు వారి చూపులను తెలంగాణ వైపు సారించారు.  దీంతో తెలంగాణలో మద్యం టెండర్లకు జోష్ పెరిగింది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ లో షాపులకు గిరాకీ పెరిగింది.  పెద్ద మొత్తంలో బోర్డర్ జిల్లాలైన నల్గొండ, ఖమ్మం నుంచి ఎక్కువగా టెండర్లు వేశారు.  అయితే, కర్నూలు బోర్డర్ తో ఉన్న మహబూబ్ నగర్లో మాత్రం పెద్దగా టెండర్లు పడలేదు.  ఇక హైదరాబాద్ నగరంలో కూడా దీనిపై పెద్దగా దృష్టిపెట్టలేదు.  


ఈనెల 9 వ తేదీ నుంచి మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ మొదలైంది.  అయితే, టెండర్ల ప్రక్రియ నత్తనడకన సాగడంతో ప్రభుత్వం భయపడింది.  టెండర్లు తక్కువగా వస్తాయేమో అనుకుంది.  శనివారం, ఆదివారం సెలవు కావడంతో సోమవారం రోజున భారీగా టెండర్లు వచ్చాయి.  సోమవారం వరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణలో మొత్తం 10,926 టెండర్లు వచ్చాయి.  మంగళ, బుధవారం సమయం ఉండటంతో ఈ టెండర్లు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  


ఆంధ్రప్రదేశ్ లో మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.  నాలుగు సంవత్సరాలలో పూర్తిగా నిషేధం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొన్నది. మద్యపానాన్ని కేవలం ఐదు నక్షత్రాల హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తామని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలకు ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టే మద్యం నిషేధిస్తే ఆదాయం ఎలా వస్తుంది అన్నది ప్రతిపక్షాల వాదన. 


మరింత సమాచారం తెలుసుకోండి: