ఎన్నిక‌ల ప్ర‌చారంలో నాయ‌కుల నోటికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. క‌నీస మ‌ర్యాద సైతం పాటించ‌కుండా...నేత‌లు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ నెల 21న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేప‌థ్యంలో సోనిపట్‌లో జరిగిన ఎన్నికల సభలో హర్యానా సీఎం మనోహర్‌లాల్‌  ఖట్టర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని, జన్నాయక్‌ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.  ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఖట్టర్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమె ‘చచ్చిపోయిన ఎలుక’ వంటిదని వ్యాఖ్యానించారు. ఖట్టర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది.


గ‌త‌, ప్ర‌స్తుత ప‌రిణామాల‌కు లంకె పెడుతూ...హర్యానా సీఎం మనోహర్‌లాల్ కాంగ్రెస్‌పై మండిప‌డ్డారు. ‘కుటుంబ పార్టీల తమాషా మీకు తెలుసు. కుటుంబంలో సభ్యులు పరస్పరం గొడవ పడతారు. ఓ వైపు ‘పప్పు’, మరోవైపు ‘మమ్మీ’ ఉంటారు’ అని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌గాంధీ స్థానంలో గాంధీ కుటుంబేతర వ్యక్తి నియామకానికి అన్వేషించారని, గాంధీ కుటుంబానికి దూరమైతే ఆ పార్టీకి మంచి రోజులు వస్తాయని భావించామని తెలిపారు.  కానీ మళ్లీ మూడు నెలల తర్వాత గాంధీ కుటుంబ సభ్యురాలు సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారంటూ.. ‘ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది. అది కూడా చచ్చిన ఎలుక’ అని పేర్కొన్నారు.

హ‌ర్యాన సీఎం వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్‌ పార్టీ తక్షణం ఖట్టర్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. మహారాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నితిన్‌ రౌత్‌ మాట్లాడుతూ ‘ఖట్టర్‌ కాదు ఖచ్చర్‌ (గాడిద)’ అని వ్యాఖ్యానించారు. సోనియా పట్ల అవమానకర వ్యాఖ్యలు చేయడం నేరపూరితమని అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుష్మితా దేవ్‌ పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనాన్ని తెలియజేస్తున్నాయని, బీజేపీ మహిళ వ్యతిరేకతకు నిదర్శనమని కాంగ్రెస్ మండిప‌డింది.


మరింత సమాచారం తెలుసుకోండి: