ఏపీ రాజకీయాల్లో ఇపుడు సరికొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇదమిద్దంగా చెప్పలేనప్పటికీ ఇపుడు ఉన్న బడా నాయకుల హవా మెల్లగా తగ్గిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొత్తగా బలమైన రాజకీయ శక్తులు ముందుకు దూసుకువచ్చేందుకు కూడా మార్గలు సుగమం చేసుకోవాలన్న తపన కనిపిస్తోంది.


ఇపుడున్న ఏపీ రాజకీయాలను గమనిస్తే తెలుగుదేశం పార్టీ బాగా నీరసించిపోయిందనే చెప్పాలి. టీడీపీకి ఆయువు పట్టుగా ఉన్న చంద్రబాబు దాదాపుగా చేతులెత్తేసిన వాతావరణం ఉంది. ఆయనే స్వయంగా చెప్పేసుకుంటున్నారు. తాను ఒంటరిగా పోటీ చేయడం వల్లనే ఓటమిపాలు అయ్యానని. అంటే తనకు సింగిల్ గా వచ్చే శక్తి లేదని అధినాయకుడే అంగీకరిస్తున్న నేపధ్యం ఉంది. సరిగా ఈ పాయింటే పట్టుకుని ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ గేం ఆడడానికి బీజేపీ తయారవుతోంది. ఏపీ పాలిటిక్స్ లో ఇప్పటివరకూ కనీసమాత్రంగా కూడా బలం లేని బీజేపీ తెలుగుదేశం వైపు నుంచి పట్టు సాధించి జగన్ని ఢీ కొట్టాలనుకుంటోంది.


అయితే బాబు బేలగా నాకు బలం సరిపోదు పొత్తులకు రెడీ అంటే వెంటనే మేము రెడీ అంటూ బీజేపీ ఇపుడు రంగంలోకి దిగిపోయేందుకు రెడీగా లేదంటున్నారు. అలా దిగిపోతే ఏపీలో బీజేపీ ఎదుగుదలకు అది ఆటకంగా ఉంటుందని, అదే సమయంలో రోజురోజుకు క్షీణిస్తున్న చంద్రబాబు రాజకీయ బలానికి కొత్త వూపిరి ఇచ్చినట్లు అవుతుందని కూడా బీజేపీ అంచనా వేస్తోంది. అందువల్ల బాబు వెంట సానుకూల సంకేతలు ఇలా వచ్చాయో లేదో అలా ఆ పార్టీ ఏపీ ఇంచార్జి  సునీల్ దియేధర్ ఖండించేశారు.


ఏపీలో టీడీపీతో పొత్తు లేదని ఖరాఖండీగా చెప్పేశారు. అయితే అది పై పై మాటలేనని, పొత్తు ఖాయమని  రెండు పార్టీలకూ తెలుసు. అయితే ఈసారి పొత్తు మాత్రం బీజేపీ చెప్పినట్లు ఉంటుంది. బాబు చేత కాషాయం తాగించేలా ఉంటుంది. బాబు ఎంతకైనా తగ్గిపోయేలా ఉంటుంది. ఒక్కసారి టీడీపీని పొత్తు పేరు చెప్పి మొత్తానికి మొత్తం బలం కొల్లగొట్టేలా ఉంటుంది. దానికి గాను ఏపీలో టీడీపీని ఇంకా బలహీనం చేయాలని బీజేపీ ఆలోచిసోందట. లోకల్ బాడీ ఎన్నికల్లో విడిగా బీజేపీ పోటీకి రెడీ అంటోంది.


అలా చేయడం వల్ల వైసీపీకే రాజకీయ లాభం కలుగుతుంది. అయినా ఇపుడు టీడీపీ బలం తగ్గాలి. అదే బీజేపీ ఎత్తుగడ, ఇలా మరో రెండేళ్ల నాటికి పూర్తిగా టీడీపీని సగానికి సగం చేసేశాక అపుడు పొత్తుల ప్రస్తావన తెస్తారట. అంటే బాబును బదనాం చేయడమే ఇపుడు ఏపీలో బీజేపీ తాజా అజెండాగా కనిపిసోంది. మరి ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: