సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వైఖ‌రి గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ప‌రిపాల‌న‌, రాజ‌కీయం, ఉద్య‌మం...అంశం ఏదైనా ఆయ‌న శైలి విభిన్నం.  నూతనంగా ఏర్పడిన తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మిస్తే తప్పేమిటని భావిస్తున్న కేసీఆర్ ప్ర‌స్తుతం ఉన్న సెక్ర‌టేరియ‌ట్ కూల్చివేయాల‌ని భావించ‌డం, కార్యాల‌యాల‌ను త‌ర‌లించ‌డం....ఆయ‌న నిర్ణ‌యంపై కేసులు న‌మోద‌వ‌డం...తెలిసిన సంగ‌తే. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలో నూతన భవన సముదాయాన్ని నిర్మించాలన్న మంత్రిమండలి నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిన్లపై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నూతన సచివాలయాన్ని నిర్మిస్తే తప్పేమిటని చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్‌చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాసనం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. 


ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలోని ప్రభుత్వ భవనాలు, ఆస్తులపై గవర్నర్‌కు నిర్ణయాధికారం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదని పిటిషనర్లు పేర్కొనగా.. తెలంగాణ క్యాబినెట్ సలహా మేరకు గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఆ చట్టంలో స్పష్టంగా ఉన్నదని హైకోర్టు ధ‌ర్మాస‌నం ప్రస్తావించింది. ఏపీకి సంబంధించిన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అమరావతికి తరలిపోయినప్పుడు ఏపీ పునర్విభజన చట్టంతో సంబంధం ఏమున్నదని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ గవర్నర్, సీఎం కార్యాలయాలతోపాటు అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ అమరావతిలో ఉన్నప్పుడు సెక్షన్ 8 సమస్య ఎలా ఉత్పన్నమవుతుంది? ఆ సెక్షన్‌కు కాలం చెల్లినట్టేకదా? దేశంలో కాలంచెల్లిపోయిన చాలా చట్టాలు ఉన్నాయని, వాటిని తొలిగించాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్ ఎప్పటికప్పుడు మనకు గుర్తుచేస్తుంటుంది అని ధర్మాసనం తెలిపింది. 


తెలంగాణ ప్ర‌భుత్వం నూత‌న సచివాల‌యం నిర్మాణం...దానిపై ప‌లువురు  న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డం...హ‌ఠాత్తుగా సెక్ష‌న్ 8 తెర‌మీద‌కు రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉండ‌టంతో పాటుగా సీమాంధ్రుల‌కు ప‌లు హక్కులు క‌ల్పించే ఈ సెక్ష‌న్‌ను వివిధ అంశాల‌ను పేర్కొంటూ...ఎత్తివేస్తారా? అంటూ ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆందోళ‌న చెందుతున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. సీమాంద్రుల విష‌యంలో హైద‌రాబాద్‌లో ప‌రిస్థితులు ఇబ్బందిక‌రంగా లేన‌ప్ప‌టికీ...ముఖ్య‌మైన అంశాన్ని ప్ర‌స్తావించే సెక్ష‌న్ 8 విష‌యంలో తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిన అంశాల‌తో భ‌విష్య‌త్తులో ప‌రిణామాలు మార‌నున్నాయా?అంటూ ఇంకొంద‌రు త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియాలో వ్య‌క్తీక‌రిస్తున్నారని చ‌ర్చ జ‌రుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: