నిపుణులు ముందు నుండి చెబుతున్నట్లే విజయవాడ ప్రాంతం డేంజర్ జోన్లో ఉన్నట్లు తాజాగా నిర్ధారణ అయ్యింది.  భూ కంపాల ప్రభావంతో దేశవ్యాప్తంగా అత్యధికంగా డేంజర్ జోన్లో ఉన్న ప్రాంతాలపై హైదరాబాద్ ఐఐఐటి లోని ఇడిఆర్ఐ శాస్త్రజ్ఞులు పరిశోధనలు జరిపారు. తమ పరిశోధనల్లో దేశవ్యాప్తంగా 50 మండలాలు, ఓ జిల్లా ప్రమాదకర జోన్లో ఉన్నట్లు తేలింది.

 

శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో మిగిలిన ప్రాంతాల మాటెలాగున్నా ఏపి రాజధాని ప్రాంతంగా ఉన్న విజయవాడ ప్రమాదంలో ఉన్నట్లు తేలిపోయింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని జనసాంద్రత, గృహనిర్మాణం, నగరాల పరిస్ధితి ఆధారంగా పరిశోధనలు చేశారు. దాదాపు మూడేళ్ళపాటు ఎంతో శ్రమించి పరిశోధనలు చేసి భూకంప ప్రభావిత ప్రాంతాలను ఫైనల్ చేసినట్లు ప్రొఫెసర్ రాయనచర్ల ప్రదీప్ చెప్పటం గమనార్హం.

 

నిజానికి ఏపి రాజధాని ప్రాంతంగా చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసినపుడు నిపుణుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమయినా వాటిని చంద్రబాబు లెక్క చేయలేదు.  గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని తన సామాజికవర్గానికి, టిడిపి ముఖ్యులకు లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్ల ఇప్పటికీ ఆరోపణలు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

 

అమరావతి ప్రాంతంలోని చాలా గ్రామాల్లో భూమి చాలా లూజ్ సాయిల్ అని, భారీ నిర్మాణాలకు ఏమాత్రం పనికిరావని అప్పట్లోనే నిపుణులు చెప్పారు. నిపుణులే కాకుండా చంద్రబాబు ఎంతో మక్కువ చూపించిన సింగపూర్ కంపెనీలు కూడా అమరావతి ప్రాంతాన్ని భూకంపాలు సంభవించే డేంజర్ జోన్ గా గుర్తించింది.

 

ఇదే విషయాన్ని చంద్రబాబుతో కూడా చర్చించారు. అయితే చర్చల సారంశం మాత్రం  బయటకు పొక్కలేదు. చంద్రబాబు హయాంలోనే రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో భూకంప ఛాయలు కనిపించాయి. కొన్నిసార్లు భూమి కంపించింది కూడా.  సరే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చంద్రబాబు కలలు కన్న సింగపూర్ తరహా రాజధానిని ప్లానును పక్కన పెట్టినట్లు సమాచారం. దాంతో రాజధాని ప్రాంతంలో భారీ నిర్మాణాల ముప్పైతే కొంత వరకూ తప్పినట్లే అనుకోవాలి. మరి భూకంపాల ముప్పు సంగతి ఏమవుతుందో భవిష్యత్తే తేల్చాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: