తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఆర్టీసీ స‌మ్మె...ఓవైపు శుభం కార్డు దిశ‌గా సాగుతుండ‌గా...మ‌రోవైపు...ఢిల్లీ ఫోక‌స్ పెరుగుతోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా ఇతర సమస్యలపై పరిస్థితి చేయిదాటిపోకముందే సమ్మె విరమించి, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంకావాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ఆర్టీసీ కార్మికులకు సూచించారు. ప్రభుత్వం కూడా వీటిని పరిశీలించాలని కోరారు. కేకే సూచనపై ఆర్టీసీ జేఏసీ సానుకూలంగా స్పందించింది. ఇలా తెలంగాణ‌లో ప‌రిణామాలు మారుతున్న స‌మ‌యంలోనే...తెలంగాణ గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటనకు వెళ్తున్నారు..ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దృష్టికి గవర్నర్ తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.


తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరుకోగా...రోజురోజుకూ సమ్మె ఉధృతమవుతోంది. ఆర్టీసీ కార్మికులు రోజుకో రీతిలో ప్రభుత్వానికి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. వీరికి మద్దతుగా వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు సైతం ఉద్యమంలోకి వచ్చాయి.ఈ స‌మ‌యంలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌ఫున కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటామని కే కేశవరావు చెప్పారు. సీఎం ఆదేశిస్తే కార్మికులతో చర్చలు జరుపుతామన్నారు.  ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అదే సమయంలో కార్మికులు సమ్మె విరమించాలని సూచించారు. దీనిపై చర్చలు జరిపేందుకు సీఎం కేసీఆర్ చెప్పాలని, ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలన్నారు. కే కేశవరావు మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఆహ్వానం పలుకాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. చర్చలు మొదలైతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తంచేశారు.  ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 


కాగా, సోమవారం జేఏసీ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసి సమ్మె గురించి వివరించారు. ఈ ప్ర‌క్రియ పూర్త‌యిన కొద్దిసేప‌టికే...ఢిల్లీ నుంచి గ‌వ‌ర్న‌ర్‌కు పిలుపు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటనకు వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో.. సాయంత్రం 4 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో తమిళిసై భేటీ కానున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి.. ఉద్యోగ, కార్మిక సంఘాలు.. ఇప్పుడు.. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో కిందిస్థాయిలో పరిస్థితి ఎలాఉంది అనే దానిపై ప్రధానితో పాటు బీజేపీ చీఫ్ ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: