ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె ప్రభావం ప్రయాణీకులపై తీవ్రంగా పడింది. బస్సులు లేని కారణంగా ప్రైవేటు ట్రావెల్స్ సంస్ధలు యధేచ్చగా ప్రయాణీకులను నిలువు దోపిడి చేసేస్తున్నాయి. ఈ దోపిడిలో క్యాబ్ సర్వీసులదే ప్రధాన పాత్రగా ఆరోపణలు వినబడుతున్నాయి. గడచిన 10 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. దీన్ని అదునుగా తీసుకున్న క్యాబులు, ఆటోలు ప్రయాణీకులతో ఓ ఆటాడుకుంటున్నాయి.

 

మామూలుగా ఉదయం నుండి రాత్రి వరకూ వేలాది బస్సులు తిరుగుతున్న కారణంతో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడికి పెద్దగా అవకాశం రావటం లేదు. అయినా సరే, పీక్ అవర్సని, సర్ చార్జి అనే పేర్లతో దోపిడి జరుగుతున్నా అది తక్కువనే చెప్పాలి. కానీ ఇపుడు మాత్రం వాటి దోపిడికి ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి.

 

నగరంలో ఏ మూల నుండి ఏ మూలకు వెళ్ళాలన్నా ఏ సమయంలో అయినా కానీండి క్యాబులు, ఆటోలు డబల్ రేట్లు వసూలు  చేస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా అదనపు చార్జీలు వసూలు చేయవద్దని క్యాబులకు, ఆటో డ్రైవర్లకు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసినా ఎవరూ లెక్క చేయటం లేదు.

 

ఆర్టీసీ సమ్మెను విఫలం చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొందరు ప్రైవేటు డ్రైవర్లను రంగంలోకి దింపింది. అయితే వాళ్ళు నడుపుతున్న బస్సులు కూడా సాయంత్రం 6 గంటలకే డిపోలకు చేరుకుంటున్నాయి. అందులోను మొత్తం బస్సులు 11 వేలుంటే ఇపుడు నడుస్తున్న బస్సులు పదలు సంఖ్యలోనే ఉన్నాయి. దాంతో లక్షలాది మంది ప్రయాణీకులు నానా అవస్తలు పడుతున్నారు.

 

అదే సమయంలో మెట్రో రైళ్ళు కూడా సరిపోవటం లేదు.  మెట్రో ఎన్ని ట్రిప్పులు వేసినా అవసరానికి సరిపోవటం లేదు. దాంతో తప్పని పరిస్ధితుల్లో ప్రయాణీకులు కూడా క్యాబులు, ఆటోల బాదుడికి రెడీ అయిపోతున్నారు. తర్నాక-లాలాపేట మధ్య మామూలుగా అయితే రూ. 300 అయితే ఇపుడు మాత్రం 600 వసూలు చేస్తున్నారు. మరి ఆ దోడిపికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో ఏమో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: