ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం 'బంగారు తెలంగాణ'గా కాదు, బలిదానాల తెలంగాణగా మారిపోయింది. బంగారు తెలంగాణ అనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఊతపదం అని అందరికి తెలిసిందే. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడినప్పటినుంచి 'బంగారు తెలంగాణ చేస్తా' అంటూ ఎప్పుడు ఏళ్ల వేళల ఊదరగొడుతున్నారు. అయితే  కాలక్రమంగా బంగారు తెలంగాణ కావడమేమోగాని బలిదానాల తెలంగాణగా మారిపోయింది. నిజంగా ఇది చాలా విషాదకరం మరియు బాధాకరం, ఆందోళనకరం. తెలంగాణ ఉద్యమంలో మొదలైన బలిదానాలు ఇప్పటికీ కొనసాగుతుండటం తెలంగాణ దురదృష్టంఅనే అనుకోవాలి. తెలంగాణకు గొప్ప పోరాట చరిత్ర ఉంది. 


తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచంలో జరిగిన గొప్ప పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. నైజాము రాజుకు గోరీ కడతామని గర్జించిన తెలంగాణ ఇప్పుడు మాత్రం ఎందుకు ఆత్మబలి దానాలకు బలైపోతోంది? బలిదానాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావా? బలవంతంగా ప్రాణాలు తీసుకుంటేనే పాలకులు దిగొస్తారా? 1969-70 ప్రాంతాల్లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో సుమారు 400 మంది చనిపోవడం జరిగింది. 


ఇక వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరణం తరువాత చెలరేగిన మలిదశ ఉద్యమంలోనూ చాలా మంది  చనిపోవడం జరిగింది.  తొలిదశ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోగా, రెండోదశ ఉద్యమంలో చాలామంది యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్యలనే బలిదానాలు అంటున్నాం. ప్రత్యేక తెలంగాణ రాదేమోననే అనుమానంతో, మనస్తాపంతో అనేకమంది అనవసరంగా విలువైన ప్రాణాలు వదులుకున్నారు. 


 ఇటీవల  ఇంటర్మీడియట్‌ బోర్డు చేసిన పాపాల కారణంగా అనేకమంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది రాష్ట్రంలో పెనుసంచలనం కలిగించింది. అయినా సర్కారు చలించలేదు. గొడవ చేసి చేసి తల్లిదండ్రులే గమ్మున ఉండిపోయారు.అప్పట్లో  'నా మరణంతోనైనా తెలంగాణ రావాలి'...అంటూ కొందరు సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టి ప్రాణాలు కూడా  వదిలారు. అదే తరహాలో ఖమ్మం డ్రైవరు కూడా 'నేను చనిపోయినా 48 వేల మంది కార్మికులు బాగుండాలె' అని నినదిస్తూ ప్రాణాలు తీసుకున్నాడు. ఇది నిజంగా బలిదానమే.



మరింత సమాచారం తెలుసుకోండి: