వాళ్లంతా కరుడుగట్టిన ఉగ్రవాదులు..! ఆత్మాహుతి దాడులకు కూడా తెగబడతారు..! సూసైడ్ బాంబర్లుగా మారి మారణహోమం సృష్టించడమే వాళ్ల లక్ష్యం..! బాలాకోట్‌లోని జైషే మహ్మద్ టెర్రర్ క్యాంప్‌లో ఇలాంటి వాళ్లు 50 మంది వరకు ఉన్నట్టు భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది. మనదేశంలో దాడులకు పాల్పడేందుకు ఏ క్షణమైనా వీళ్లంతా సరిహద్దులు దాటే ప్రమాదమున్నట్లు ఐబీ అనుమానిస్తోంది.  


ఎనిమిది నెలల క్రితం పాకిస్థాన్ బాలకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. మిలిటెంట్ల శిబిరాలను ధ్వంసం చేసింది. బాలాకోట్ దాడి తర్వాత సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో టెర్రర్ క్యాంపులను కొనసాగిస్తూనే ఉన్నారు. మనదేశంలో దాడులకు పాల్పడి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించేందుకు సూసైడ్ బాంబర్లను సిద్ధం చేస్తున్నారు. 40 నుంచి 50 మంది వరకు కరుడుగట్టిన ఉగ్రవాదులు...బాలాకోట్‌లో మకాం వేసినట్టు... నిఘా వర్గాలకు సమాచారం అందింది.  


జమ్మూకశ్మీర్‌లోని భద్రతా బలగాల క్యాంపులపై దాడులు చేసేందుకు ఉగ్రవాదులకు పాకిస్థాన్ ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. బాలాకోట్‌లో ఉగ్రకార్యకలాపాలు మళ్లీ పుంజుకున్నట్లు నెల రోజుల క్రితమే ఆర్మీ చీఫ్ ప్రకటించారు. సైన్యం అనుమానించినట్టుగానే బాలాకోట్‌ను మరోసారి టెర్రరిస్టుల డెన్‌గా మార్చేసింది పాకిస్థాన్. నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని సాక్ష్యాలుగా మార్చాలని జాతీయ భద్రతా సలహాదారులు దోవల్ సైన్యానికి సూచించారు. 


షోపియాన్ జిల్లాలో దాడులు జరగడం...బాలాకోట్‌లో ఉగ్రవాదులు మకాం వేయడంతో సైన్యం అప్రమత్తమైంది. ఢిల్లీలో జరుగుతున్న ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో జమ్మూకాశ్మీర్‌లో భద్రతపై సమీక్ష జరిగింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు సైన్యాన్ని ఆదేశించారు. సైన్యం మాత్రం కంటికి కునుకులేకుండా దేశాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా ఎదురెడ్డి నిలబడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: