మొబైల్ సర్వీసులు తిరిగి పునరుద్ధరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించగానే కాశ్మీరీలు ఆనందపడిపోయారు...! చాలాకాలం తర్వాత సెల్‌ఫోన్ ద్వారా అందరితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంబరపడిపోయారు..! అయితే ఫోన్ ఆన్ చేస్తే గానీ వాళ్లకు అసలు విషయం అర్ధం కాలేదు. ప్రభుత్వం కరుణించినా... మొబైల్ ఆపరేటర్లు మాత్రం కశ్మీరీలకు పెద్ద షాకే ఇచ్చారు.  


ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూకాశ్మీర్‌లో సెల్‌ఫోన్లు మూగబోయాయి. 72 రోజుల నుంచి కాశ్మీర్ ప్రజలు మొబైల్ కమ్యూనికేషన్ లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తున్న కేంద్రం... మొబైల్ ఫోన్లను పునరుద్ధరించింది. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ప్రీపెయిడ్ సర్వీసులు తిరిగి వాడకంలోకి వచ్చాయి. ముందుగా బీఎస్‌ఎన్ఎల్ సేవలను, ఆ తర్వాత ప్రైవేటు ఆపరేటర్ సేవలను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తెస్తున్నారు.  


72 రోజుల తర్వాత మొబైల్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేసినా... కాశ్మీరీలకు మాత్రం సిగ్నల్స్ అందుబాటులోకి రాలేదు. దీనికి కారణం మొబైల్ ఆపరేటర్ల నిర్వాకమే.  ప్రభుత్వం రాజకీయ కారణాలతో మొబైల్ సర్వీసులను నిలిపివేస్తే... బ్లాక్ చేసిన రోజులకు కూడా బిల్లులు పంపించారు మొబైల్ ఆపరేటర్స్. పైగా 72 రోజులుగా బిల్లులు కట్టలేదంటూ అవుట్ గోయింగ్ సేవలను నిలిపివేశాయి. దీంతో కాశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మొబైల్ సేవలను పునరుద్ధరించినా... ఆపరేటర్ల నిర్వాకం కారణంగా వినియోగదారులకు ఉపయోగం లేకుండా పోయింది.  


అయితే ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. 72 రోజుల పాటు ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేకపోయినా... మొబైల్ ఆపరేటర్లు బిల్లులు పంపించారు. పోస్ట్ పెయిడ్ బిల్లులు చెల్లిద్దామంటే  ఇంటర్నెట్ అందుబాటులో లేదు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఇంటర్నెట్‌ ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంటర్నెట్‌ను పునరుద్దరించే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొబైల్స్ వినియోగంపై నిషేధం కారణంగా రెండున్నర నెలలుగా
దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోతున్న కాశ్మీరీలకు మొబైల్ ఆపరేటర్స్ పనులు  విసుగుతెప్పిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: