రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన వైఎస్సార్ రైతు భ‌రోసా ప‌థ‌కానికి పేరు మార్పు విష యం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ ప‌థ‌కానికి వైఎస్సార్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్‌గా పేరు మార్చారు. అయితే, ఇది రాత్రి రాత్రి తీసుకున్న నిర్ణ‌య‌మా?  లేక జ‌గ‌న్‌కొన్ని రోజుల కింద ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసిన‌ప్పుడు ఆయ‌న చేసిన సూచ‌న మేర‌కు ఇప్పుడు ఈ నిర్ణ‌యం తీసుకున్నారా?  లేక కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఈ ప‌థ‌కానికి సంబంధించి రూ.6000 నిధులు స‌మ‌కూరుస్తున్న నేప‌థ్యంలో కృత‌జ్ఞ‌తా పూర్వ‌కంగా ఆ పేరు కూడా ఉండాల‌ని జ‌గ‌న్ పార‌ద‌ర్శ‌క నిర్ణ‌యం తీసుకుని ఇలా ముందుకు వెళ్తున్నారా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది.


ఇక‌, బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓ వ‌ర్గం ఈ విష‌యంలో కొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. త‌న‌పై ఉన్న కేసుల నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ఇలా కేంద్రం చెప్పిన‌ట్టు వింటున్నార‌ని అంటుండ‌గా.. టీడీపీ అనుకూల సోష‌ల్ మాధ్య‌మాలు మాత్రం.. కేంద్రానికి జ‌గన్ లొంగిపోయార‌ని అంటున్నారు. వాస్త‌వానికి గ‌డిచిన ఐదేళ్ల కాలంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అనేక కేంద్ర ప‌థ‌కాలు ఏపీలో అమ‌ల‌య్యాయి.


గ్రామీణ స‌డ‌క్ యోజ‌న పేరుతో గ్రామాల‌కు రోడ్లు వేసే కార్య‌క్ర‌మం కేంద్రం భారీ ఎత్తున చేప‌ట్టింది. అదేవిధంగా స్వ‌చ్ఛ భార‌త్ పేరుతో ప్ర‌తి ఇంటికీ మ‌రుగు దొడ్లు నిర్మించే కార్య‌క్ర‌మం కూడా చేప‌ట్టింది. అయితే, అప్ప‌ట్లో ఆయా ప‌థ‌కాల‌ను త‌న‌వే అని చెప్పుకొన్నారు చంద్ర‌బాబు. దీనిపై టీడీపీతో విడిపోయిన త‌ర్వాత బీజేపీ నేత‌లు పెద్ద యాగీ చేశారు. కేంద్రం అమలు చేస్తున్న ప‌థ‌కాల‌కు చంద్ర‌బాబు త‌న స్టిక్క‌ర్ అంటించుకుంటున్నార‌ని వ్యాఖ్య‌లు సంధించాయి.


ఇక‌, ఇప్పుడు రైతు భ‌రోసా విష‌యంలోనూ బీజేపీ నేత‌లు నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కేంద్రం ఇస్తున్న డ‌బ్బులు కూడా ఇందులో ఉన్నాయి కాబ‌ట్టి.. దీనికి త‌మ పేరు కూడా పెట్టాల‌ని కోరారు. దీనిపై స‌మాలోచ‌న‌లు చేసిన జ‌గ‌న్‌.. అటు రాజ‌కీయంగాను, ఇటు పార‌ద‌ర్శ‌క‌త విష‌యంలో త‌న‌కు ఎలాంటిఇబ్బందులు లేకుండా పేరు మార్పువైపే మొగ్గు చూపించారు. ఏదేమైనా.. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో దాదాపు అర‌కోటికి పైగా రైతుల‌కు ఐదేళ్ల‌లో 67500 రూపాయ‌లు అంద‌నున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: