పట్టు విడుపులున్న రాజకీయ నాయకత్వం గాని,  కుటుంబ యాజమాన్యం గాని ఓటమి పాలైన సందర్భాలు దాదాపుగా లేవు. పిల్లలు బైకు కొనిపెట్టలేదనో, మోబైల్ కొనలేదనో తండ్రిపై అలగడం కుటుంబంలో అతి సాధారణం. భుజ్జగించో, బామాలో, తల్లి ప్రేమను ప్రయోగించో, కొంత సంధికి వచ్చో కుటుంబ సౌహార్ధ్ర జీవనాన్ని తండ్రి విజయవంతంగా నడిపించినట్లే, ఉద్యోగులు తమ కోరికలు తీర్చుకోవటానికో, దేశ విశాల ప్రయోజనాలు సాధినచటానికో, సమ్మె పేరుతో అలిగితే – వారిని తల్లి తండ్రిలా లాలించో, లాలిపప్ ఇచ్చో దారికి తెచ్చుకోవటం ముఖ్యమంత్రి తక్షణ కర్తవ్యం. 

అది మరచి తన స్వార్ధ ప్రయోజనాల సధన సాఫల్యత కోసమో, వీళ్ళా! బచ్చాగాళ్ళు నన్నేదిరిస్తారా! అనే దోర తనం ప్రయోగిస్తే సమ్మె అనే అస్త్రం,  ఉద్యమం అనే పాశుపతాస్త్రమైతే? మిగిలేది ఇక ఇద్దరికి సెల్ఫ్ డిస్మిసలే!  టిఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలో ప్రభుత్వం పన్నిన వ్యూహం బూమరాంగ్ అయిందా? వికటించిందా! అనుకున్నదొకటి అయినది ఒకటిగా అన్న చందంగా మారిందా! కాంగెస్ నాయకురాలు సినీ నటి విజయశాంతి అన్నట్లు ముఖ్యమంత్రి తన దొరతనపు దరహాసం వికటాట్టహాసంగా మరి - కఠిన వైఖరి ప్రదర్శిస్తే  ఉద్యోగులు లేదా కార్మికులు దారికొస్తారని భావిస్తే అది కాస్త సమ్మెగామారి ఆపై ఉద్యమంగా కూడా మారి పరిష్కరించ లేనంత జఠిలమై కూర్చుందనే అంటున్నారు. 

అయితే పట్టుదలలకు పోయి పీఠముడి పడ్డ ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం నేపథ్యం ఉన్న మంత్రులకు మారుగా - ఉద్యమ నేపథ్యం లేని మంత్రి పదవులకై పార్టీలు మారిన అవకాశవాద మంత్రులను రంగంలోకి దింపడంతో  వ్యవహారమంతా బెడిసికొట్టి తనపైకే బూమరాంగ్ అయిందన్నది నిజమే ననిపిస్తుందని విభిన్న రాజకీయ వర్గాలు, విపక్షాలు, విఙ్జులు, ప్రజలు, కొందరు టీఅరెస్ నాయకులు, మంత్రులు కూడా అంటున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఢిల్లీ నుంచి పరుగు పరుగున వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇచ్చిన గడువు లోగా యధావిధిగా విధుల్లో చేరని కార్మికులు ఉద్యోగాలు సెల్ఫ్- డిస్మిస్సల్ పద్దతిలో కోల్పోయినట్టేనని ఒక రాజాఙ్జలాంటి అల్టిమేటం వదిలారు. 

ఉద్యోగులు సహజంగా తమ పని తాము చేసుకు పోతూ ఉంటారు. తమ ఉద్యోగ రక్షణ సమస్యల్లో పడితే ఐఖ్యం అవుతారు. అలా ఐఖ్యమైన ఉద్యోగులు మొదట బుజ్జగింపు లకు లొంగుతారు. అక్కడ ముఖ్యమంత్రి లౌఖ్యం ప్రదర్శించాలి. కాని మన కేసీఆర్ సార్వభౌమాధికారం చూపి బెదిరించబోయారు. అక్కడే ఉద్యోగులకు తిక్కరేగి మంకు పిల్లాళ్ళలా చెలరేగిపోయారు. ఇప్పుడు వారి కోరికలు తీర్చాల్సిందే! “తల్లి” లా లాలించి అవసరమైతే సముదాయించే ట్రబుల్ షూటర్ హరీష్ రావు లాంటి వాళ్ళను ప్రయోగించాలి – కేశవరావైనా పర్వాలేదు కాని హారీష్ రావు ఉండగా కెకె ఎందుకు?  

హరీష్ రావే ఎందుకు? ఒక్కసారిగా ఆర్టీసి ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతింది. ముఖ్యంగా ఏ మాత్రం తెలంగాణా కోసం త్యాగం చేయకుండా మంత్రులైన వాళ్ళు ఆర్టీసి ఉద్యోగులు కేసీఆర్ మద్య కలగజేసుకున్న దరిమిలా పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. సంధికి దారులు మూసుకుపోయాయి. ఉద్యోగ కార్మిక వర్గాలు కూడా పట్టుదలకు పోయారు. 

ఈ నేపథ్యంలో మంత్రుల్లో విభేదాలు పొడచూపాయి. రెండు భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తెలంగానా ఉద్యమంలో నుంచి ఉద్భవించిన టీఎంయూ...  తెలంగాణ సాధనలో దాని పాత్ర  కీలకమైందని, కార్మికులతో అంత కఠినంగా ఉండడం తగదనీ ఉద్యమకాలం నాటి మంత్రులుగా వారిపట్ల సంకుచితంగా కఠినంగా ప్రవర్తించ లేమని అభిప్రాయానికి వచ్చారు. 

అందుకే ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌, ఈటెల, హరీష్ సహా ఉద్యమకాలంనాడు ఉద్యమంలో జనం నుంచి ఏదిగిన మంత్రులెవరూ సమ్మెపై గాని సమ్మెటపోటుపై గాని నోరు మెదపలేదు.  సమ్మెను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా ఉద్యమ కాలం నాటి సాహచర్యం మైత్రి గుర్తుకువచ్చి మంత్రులు స్పందించలేదనే చెప్పాలి. 
 
మరోవైపు ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ లో లేకుండా, టిడిపిలో, కాంగ్రేస్ లో ఉండి ఎలాంటి త్యాగం చేయకుండా ఆయాచితంగా అవకాశవాదంతో తర్వాత వచ్చి టీఆర్‌ఎస్లో చేరి మంత్రులైనవారు మాత్రం, క్షేత్రస్థాయిలోని భావోద్వేగాలను గమనించక దుందుడుకుగా ప్రకటనలు చేయడం, ఆర్టీసీ ఉద్యోగులను వారి నాయకత్వాన్ని విమర్శించటం మొదలు పెట్టారు. దీంతో పరిస్థితి మరింత వికటించి, విషమించి - కార్మికుల ఆత్మార్పణం వరకూ చేరిన సమ్మె రానున్న 19వ తేదీన తెలంగాణా రాష్ట్ర బంద్ దాకా చేరింది.  ఇంకేం ఇక జరగనున్నది కురుక్షేత్రమే అంటే ఉద్యమమే!  తెలంగాణా ప్రజల సహజనైజం “గోటితో పోయేదానికి గొడ్దలెందుకు” అంటారు.   

ప్రగతిభవన్లో కూర్చొని సచివాలయానికి రాకుండా ఆఙ్జలు పాస్ చేసే కేసీఆర్ నాయకత్వంలోని  ప్రభుత్వంపై జనాగ్రహం అంతర్గతంగా, చాపకింద నీరులా, ఉంది.  ఇంకేం ఆర్టిసీ సమ్మెతో విసిగించినా జనాలకు ఆర్టీసి కార్మికులతో, కేసీఆర్ ఒక మెట్టు దిగైనా మాట్లాడితే దొర వారి దొరతనం తగ్గుతుందా? అనుమానమా? అవమానమా? అంటూ ప్రశ్నించే స్థాయిలో పెల్లుబికింది. 

‘‘ఉద్యమంలో పాల్గొని కడగండ్ల పాలై త్యాగాలు చేసి మంత్రులైనవాళ్ళు మాట్లాడితే మాకు ఓకేగాని, ఉద్యమంలో పాల్గొనకుండా ఉద్యమాన్ని, ఉద్యమకారుల్ని విమర్శించి న చరిత్ర లేని ఇంకా మాట్లాడితే చరిత్ర హీనులైన ఎర్రబెల్లి, తలసాని, పువ్వాడ, గంగుల లాంటి వాళ్లు మమ్మల్ని బెదిరించడ మేమిటి!?’’ అని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్‌ ఎన్నడూ చెప్పలేదని, ఆ నినాదం టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోనే లేదని మంత్రులు పువ్వాడ, తలసాని, ఎర్రబెల్లి వంటివారు వ్యాఖ్యానించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆర్టీసీ కార్మికులను ఉద్యమ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని నాడు కేసీఆర్‌ వాగ్దానం చేశారనీ, ఆర్టీసీ విలీనంపైనా హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆబగా అవకాశాలు పొందటానికి పార్టీలో చేరి కేసీఆర్ దయాబిక్షతో మంత్రులైన మీకు ఆలోతైన భావోద్వేగాలు సంతరించుకున్న విషయాలు ఎలా తెలుస్తాయని కార్మికులు ప్రశ్నించారు. అసలు వీళ్ళు సమస్య పరిష్కారానికి అర్హులే కాదు అని తీర్మానించారు. ఉద్యమ సమయంలో లేని వాళ్లు, అదీ టీడీపీలో ఉన్న వాళ్లు, ఇప్పుడు ఆర్టీసీ నేతలపై విమర్శలు కురిపించటం అగ్నిలో ఆజ్యం పోయగా సమస్యను మరింత తీవ్రరూపం దాల్చింది. అసలు కేసీఆర్ రెండోసారి పదవిలోకి రావటానికి కారణమైన టిడిపి నాయకత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో అక్రమంగా కూడి తెలంగాణాలో ప్రవేశించటమే! 

అలాంటి వాళ్ళు అన్నిటికి ముఖ్యమంత్రే కావాలా? ఏం మేం లేమా? ఆని సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తే ఎవరూర్కుంటారు.రాజకీయ అవసరాలకు వాళ్ళు కేసీఆర్కు అవసరమేమో గాని – ప్రజల దృష్టిలో వాళ్ళు అవకాశవాదులే కదా! కార్మికులు, ఉద్యోగుల నడుమ చిచ్చు పెట్టే ‘విభజించు, పాలించు’ అన్న బ్రిటీష్ పద్దతిని అనుసరించాలని తలచిన ప్రభుత్వ వ్యూహం వారిని “నిప్పుతొక్కిన కోతినే చేసింది.” ఇక కేసీఅర్ ఆశించిన ఫలితాలు ఆర్టీసీ కార్మికుల నుండి లభించే ప్రశ్నే లేదు. 

ప్రభుత్వ సన్నిహితులు, కొన్ని ఉద్యోగ సంఘ నేతలు, ఉద్యోగులు, ఇటు జనం నుంచీ ప్రభుత్వం నుండి భారీ నుంచి అతి భారీ స్థాయిలో ఒత్తిడి వచ్చింది. వీటికి తోడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మద్దతిస్తానన్న సీపీఐ – కఠినమైన హేచ్చరికతో మద్దతు ఉపసంహరించుకుంది.  నేల నలు చెరగులా ప్రభుత్వ ప్రతికూల పవనాలే వీచటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడగా – కొందరు నాయకులు ఆర్టీసి కార్మిక అనుకూల ప్రకటన లు చేస్తూవస్తున్నారు. 
 
కార్మికులు “సెల్ఫ్‌-డిస్మిస్‌” చేసుకున్నారనీ, వారిని తిరిగి  ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ‘ధికారస్వరమును సైతునా?” ఆన్నట్లు ప్రవర్తించిన ప్రభుత్వం “ఒక మెట్టు” కాదు "పది మెట్లు" దిగడానికి సిద్ధపడి -  బేషరతుగా క్షమాపణ చెప్పి తిరిగి ఉద్యోగంలోకి చేరతామనే వారిని ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి సిద్ధమనే రీతిలో సంకేతా లివ్వాల్సిందిగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ప్రముఖులకు  సూచించినట్టు తెలిసింది. ఈ మేరకు డిపో మేనేజర్లకు ఆదేశాలిస్తామని కూడా సూచించారట కూడా! 

ప్రభుత్వం తరఫున బహిరంగంగా ఎలాంటి హామీ లేకుండానే ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లో చేరేలా ఒప్పించాలని పేర్కొన్నారట. అయితే ఇప్పటికే పరిస్థితి ముదిరి పాకాన పడిందని  చేయిదాటిపోయిందని, అలాంటి వాటితో ఇప్పుడు చర్చలకు కూర్చోవటం వలన ఉపయోగం లేదని ఉద్యమ మంత్రులు కూడా కేసీఆర్ కు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. 

ఆర్టీసీలో పని చేస్తున్న వారంతా చిన్న చిన్న జీతాలతో బతుకుతున్నారని, పైగా, ఉద్యమ సమయంలో వారితో తమకు భావోద్వేగ అనుబంధం ఉందని, డిమాండ్లను పరిశీలిస్తా మని ఒక్కమాట స్వయానా కేసీఆర్ చెపితేనే, తాము సమ్మెను విరమింపజేస్తామని ముగ్గురు నలుగురు ఉద్యమ మంత్రులు భిన్న విభిన్న మార్గాల ద్వారా కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. 

అయితే సీఎం అందుకు ససేమిరా! అన్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు లొంగితే మున్ముందు మిగతా ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమబాట పడతాయని, దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడుతాయని కేసీఆర్‌ భావించారు. అయితే డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి, కండక్టర్‌ సురెందర్  గౌడ్ కూడా ఆత్మహత్య చేసుకోవటం మరికొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం లాంటి సంఘటనలు ప్రభుత్వం మెట్టు దిగకతప్పని వాతావరణాన్ని కల్పించాయి. 
 
దీంతో ‘ఆర్టీసీ కార్మికులకు లొంగినట్టు కన్పించకూడదు. అలాగని, పరిస్థితిని తెగేదాకా లాగకూడదు!’ అనే ఉద్దేశంతోనే ఎంపి కే. కేశవరావును సీఎం చర్చలకు పురమాయించి నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అటు కాంగ్రెస్‌లోనూ ఇటు టీఆర్‌ఎస్ లోనూ కీలక నేతగా ఉండి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన కేకే ద్వారా రాజీకి ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. 

సమ్మెపై సీఎం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా పేర్కొనడం గమనార్హం. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఐఏఎస్ లతో కాకుండా ఉద్యమ మంత్రులతోనే కమిటీ ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 

ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర సర్వొన్నత న్యాయస్థానం ఎలా తీరు ఇస్తుందో చూడాలి. నాడు పురచ్చితలైవి దివంగత జయలలితకే ఉద్యోగులపై సామూహిక సస్పెన్షన్ చేసిన దానికి మొట్టికాయలేసింది న్యాయస్థానం. స్అదే జరిగితే కేసీఆర్ నిర్ణయం కోసం నిరీక్షించే పనే ఆర్టీసి కార్మికులకు ఉండదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: