ఆర్టీసీ స‌మ్మె కేంద్రంగా...టీఆర్ఎస్ పార్టీపై, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ విరుచుకుప‌డుతోంది. తాజాగా గాంధీభవన్లో కాంగ్రెస్ నేత‌లు మాట్లాడుతూ... వివిధ అంశాల‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 11రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండ‌టం బాధాక‌ర‌మ‌న్నారు. కార్మికులను తొలగిస్తున్నాం...కొత్త వారిని నియమిస్తాం అని సీఎం అహాంకార పూరితంగా మాట్లాడారని, దీంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ``అధికార మదంతో సీఎం మట్లాడుతున్నాడు..పోలీసులతో కార్మికులపై పెత్తనం చేస్తున్నాడు..బేషజాలకు పోకుండా ప్రభుత్వం చర్చలు జరపాలి`` అని డిమాండ్ చేశారు.


గత పదిరోజుల పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ కార్యచరణను త్వ‌ర‌లో ప్రకటిస్తుందని రేవంత్ వెల్ల‌డించారు. ``కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అన్ని బంద్‌లో పాల్గొంటాయి. 19వ తేదీలోపు సమస్య పరిష్కరించకుంటే 21న ప్రగతి భవన్ ముట్టడిస్తాం``అని ప్ర‌క‌టించారు. ``గత నెల ప్రగతి భవన్లో హస్కి అనే కుక్క చనిపోయిందని ..సంబందిత డాక్టరుపై 5 సంవత్సరాల శిక్ష పడేలా కేసు నమోదు చేశారు..మంత్రుల భాధ్యతారహిత్య వ్యవహారం వల్ల కార్మికులు చనిపోయారు...మంత్రుల మీద కేసు ఎంధుకు నమోదు చేయలేదు?కుక్క కు ఉన్న విలువ మనిషికి లేదా?కుక్క చనిపోతే ఏఫ్ఐఆర్ నమోదు చేశారు..కార్మికులు చనిపోతే చర్చలకు పిలవరా`` అని రేవంత్ ప్ర‌శ్నించారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుందని ఆయ‌న వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీ  కార్మికులకు అండగా ఉంటుందని, కేసీఆర్ మెడలు వంచి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ వత్తిడి తెస్తుందని ప్ర‌క‌టించారు. 


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలిస్తమని కేసీఆర్ గ‌తంలో అన్నార‌ని తెలిపిన రేవంత్ రెడ్డి...ప్రభుత్వంలో విలీనం చేయకుండా అది సాద్యపడుతుందా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ``గతంలో టీంఎంయూకు  గౌరవ అధ్యక్షుడుగా హరీష్ రావు ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు ఎందుకు స్పందించ‌డంలేదు?`` అని ఆయ‌న పేర్కొన్నారు. సెల్ఫ్ డిస్మిస్ రాజ్యంగంలో ఎక్కడైనా ఉందా అని ప్ర‌శ్నించారు. ఓ పక్క కార్మికుల ప్రాణాలు పోతుంటె ప్రగతి భవన్‌కు పోయిన ఉద్యోగ సంఘాల నేతలకు ముద్దెట్ల దిగిందనే అనుమానం వస్తుందని ఆయ‌న వ్యాఖ్యానించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: