ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో  మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులెవరూ వెళ్లలేదు. కనీసం అభినందనలు కూడా చెప్పలేదు. దీంతో ఈ విషయంపై ఏపీ రాజకీయ పార్టీలతోపాటు, టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు జగన్‌తో భేటీ అవ్వడం ఏపీ అంతటా చర్చనీయాంశమైంది.


ముఖ్యంగా వీరిద్దరూ ఏయే విషయాల పట్ల చర్చించారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి చూపిస్తున్నారు. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సుతారం ఇష్టం లేదట. అందుకే అన్నయ్యపై తమ్ముడు కోపంగా ఉన్నాడని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు జగన్ చిరు ఇద్దరి భేటీతో పవన్ కళ్యాణ్ పరిస్థితి అంతు చిక్కకుండా ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ భేటీపై మాట్లాడిన చిరంజీవి. జగన్ ప్రమాణ స్వీకారానికి ఎందుకు వెళ్లలేదన్న దానిపై వ్యాఖ్యలు చేశారు. తాను సైరా షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగానే, జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోయానని  సీఎం కాగానే, ఆయన్ను కలిసి అభినందించాలని అనుకున్నానన్నారు చిరంజీవి.


రెండు రాష్ట్రాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని జగన్ తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన రాజకీయ శత్రువుతో తన అన్న కలవడం ఏమిటనే ఆలోచనలో ఉన్నారన్న కధనాలు వినిపిస్తున్నాయి. ఏపీలో జనసేనకు మెగాస్టార్ బూస్టింగ్ ఇస్తాడని పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా అనుకుంటున్నాడట. అందుకే అన్న కుటుంబానికి దగ్గర అవుతున్నాడని ప్రచారం కూడా ఉంది. అందుకే ప్రతి ఫంక్షన్ - సినిమా ప్రమోషన్లకు పవన్ కళ్యాణ్ వెళుతున్నాడని.....ఈ నేపథ్యంలోనే ఇటీవల సైరా సినిమాకు కూడా తన వాయిస్ ఓవర్ ఇచ్చాడని అంటుంటారు.


అయితే రోజు రోజుకు అన్నదమ్ముల అనుబంధం బలపడుతున్న తరుణంలో సీఎం జగన్ తో చిరు భేటీ కావడంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలోపడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారన్నారు చిరు. పరిశ్రమకు ఏది కావాలన్న సంకోచించకుండా తనని అడగాలని కూడా జగన్ కోరినట్టు చిరంజీవి తెలిపారు. జగన్‌తో భేటీ సొంత కుటుంబీకులతో గడిపిన అనుభూతిని కలిగించిందన్నారు మెగాస్టార్.

మరింత సమాచారం తెలుసుకోండి: