వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హత్య జరిగి ఆరునెలలు అయినా అసలైన నిందితులెవరో గుర్తించలేదని ప్రతిపక్షాలు.. అధికార పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఎవరు హత్య చేశారో జగన్ కు తెలుసనీ.. అయినా నిజం బయటకు రాలేదని టీడీపీ నేతలు ఆరోపించడంతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ప్రకటించారు. ఎవరైనా పుకార్లు సృష్టిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. 


ఇంతకుమునుపు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రీనివాస రెడ్డి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. అసలు ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అసవసం ఏమొచ్చిందనే ప్రశ్న అందరిలో మెదిలింది. వివేకాను హత్య చేసేందుకు శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూర్ కు చెందిన సునీల్ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి.  


వివేకానందరెడ్డి హత్య కేసును మసిపూసి మారేడు కాయ చేసేలా కుట్ర జరుగుతోందని టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ హత్యకేసును సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులను నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు వర్ల రామయ్య. ఎన్నికల సమయంలో వివేకా కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన విషయాన్ని వర్ల రామయ్య జ్ఞప్తికి తెచ్చారు. ప్రస్తుతం ఆయన కుమార్తె కూడా ఎందుకు సైలెంట్ గా ఉందని ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు వర్లరామయ్య. పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు జరిపి.. తమ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలన్నారు. సీఎం చిన్నాన్న కేసులోనే ఇంత తాత్సారం జరిగితే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రస్నించారు వర్లరామయ్య. వివేకా హత్య వెనుక ఎవరి హస్తం ఉందో ప్రజలకు తెలియాలని డిమాండ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: