అమెరికాలో హెచ్ వన్ బీ వీసాదారులపై రోజుకో పిడుగు పడుతుంటే.. ఇప్పుడు యూఏఈలో నర్సుల వంతొచ్చింది. అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. కేరళ మినహా మిగతా రాష్ట్రాల్లో నర్సింగ్ కోర్సులు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 


యూఏఈలో నర్సులుగా పనిచేస్తున్న వందలాది మంది భారతీయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. దీనికి కారణం నర్సుగా విధులు నిర్వహించేందుకు తాజాగా యూఏఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కనీస విద్యా అర్హత నిబంధన. ఇకపై నర్సులుగా విధులు నిర్వహించాలంటే నర్సింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీంతో ఇప్పటి వరకు డిప్లొమా సర్టిఫికెట్లపై విధులు నిర్వహిస్తున్న నర్సుల ఉద్యోగాలకు ఎసరు పడింది. 


కొత్తగా తీసుకొచ్చిన నిబంధన కారణంగా ఇప్పటికే ఉత్తర ఎమిరేట్స్‌లోని కొన్ని ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 200 మందికి పైగా భారతీయ నర్సులు ఉద్యోగాలు కోల్పోయారు. మరి కొన్ని ఆస్పత్రులు మాత్రం నర్సు హోదాను తగ్గించి వేరే విధులను అప్పగించాయి. ఇంకా కొన్ని ఆస్పత్రి యాజమాన్యాలు డిప్లొమా సర్టిఫికెట్లు ఉన్న నర్సులు తమ వద్ద పనిచేయాలంటే 2020 నాటికి యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో పోస్ట్ బేసిక్ బీఎస్‌సీ నర్సింగ్ ప్రోగ్రాం పూర్తి చేయాల్సిందిగా సూచిస్తున్నాయి. దీంతో చాలా మంది నర్సులు వివిధ విశ్వవిద్యాలయాలలో ఈ నర్సింగ్ ప్రోగ్రాంలో చేరారు. ఇక్కడే నర్సులకు మరో సమస్య వచ్చి పడింది. 


నర్సుల డిప్లొమా సర్టిఫికెట్ల సమానత్వ ధృవీకరణ పత్రం కోసం  వారు చేసిన అభ్యర్థనలు తిరస్కరించబడుతున్నాయి. యూఏఈ విద్యా మంత్రిత్వ శాఖ కేవలం కేరళ రాష్ట్రం నుండి పొందిన డిప్లొమా సర్టిఫికెట్లకు మాత్రమే సమాన ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తోంది. భారత్‌లోని మిగతా రాష్ట్రాలకు చెందిన డిప్లొమా హోల్డర్లకు కష్టాలు తప్పడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన డిప్లొమా సర్టిఫికెట్లు గల నర్సులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.          


మరింత సమాచారం తెలుసుకోండి: