తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉదృతం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని చేసిన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత పెరిగింది. ఇప్పటికే మనస్థాపం చెందిన ఆర్టీసీ కార్మికులు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరి కొందరు ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రుల పాలయ్యారు. ఇంకొందరు గుండెపోటుతో మృతి చెందారు. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ స్పందించిన దాఖలాలు లేవు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తమ సమస్యకు పరిష్కారం చూపాలని, తక్షణమే స్పందించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై కి విన్నవించుకున్నారు.

 

గవర్నర్ ను కలిసిన ఆర్టీసీ కార్మిక జేఏసీ

నిన్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక జేఏసీ గవర్నర్ తమిళిసై ని కలిశారు. తమ సమస్యలు పరిష్కరించటానికి చొరవ చూపాలని వినతి పత్రాన్ని ఆమెకు అందించారు. తాము న్యాయపరమైన డిమాండ్లతోనే ఈ సమ్మె ప్రారంభించామని, కానీ తమ సమస్యలను పరిష్కరించకుండా సీఎం కెసిఆర్ తన మొండి వైఖరితో తమ జీవితాలని నాశనం చేస్తున్నాడని గవర్నర్ కు చెప్పుకున్నారు. ప్రభుత్వానికి మీ వంతు సలహాలు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు తెలంగాణ గవర్నర్ తమిళిసై కి మొరపెట్టుకున్నారు.

 

స్పందించిన గవర్నర్ .. ప్రభుత్వ నివేదిక కోరే ఛాన్స్

ఇప్పుడు కార్మిక సంఘాల నేతలు గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడంతో గవర్నర్ తమిళిసై ప్రభుత్వం నిర్ణయంపై నివేదిక కోరే అవకాశం కనిపిస్తుంది. ఇక అదే గనుక జరిగితే తాజా పరిణామాలు అన్నింటిని రిపోర్టు రూపంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక ఆ సమయంలో కార్మికుల విషయంలో సెల్ఫ్ డిస్మిస్ లాంటి విషయాన్ని ప్రస్తావించడం కుదరదు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం గవర్నర్ కు ఆర్టీసీ సమ్మె విషయంలో ఏ విధంగా రిపోర్ట్ ఇస్తుంది అన్నది ఆసక్తికరమే. గవర్నర్ తమిళి సై ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతానికి ఆసక్తికరంగానే మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: