తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  సమ్మె ఉదృతంగా మారిపోవడంతో హైకోర్టు కలుగజేసుకుంది.  సమ్మెపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో దీనిపై ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపింది.  ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు సూచించింది. చర్చలు జరిపి వివరాలను హైకోర్టుకు తెలియజేయాలని కోరింది.  


అయితే, ఆర్టీసీ కార్మికులు మాత్రం ఆర్టీసీని విలీనం చేసే వరకు సమ్మె విరమించేది లేదని అంటున్నారు.  ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను కూడా పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమ్మెకు నోటీసులు ఇచ్చి సమస్యలను పరిష్కరించమంటే.. వాటిని పక్కన పెట్టి.. తమ ఉద్యోగాల నుంచి తొలగించేస్తున్నామని చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.  


ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వస్తామని, కానీ, సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.  ఈనెల 18 వ తేదీన తమ వాదనలు వినిపిస్తామని అన్నారు.  ఇదిలా ఉంటె, తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు వివిధ పార్టీల నుంచే కాకుండా.. వివిధ సంఘాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.  టిఎన్జీవోలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తున్నారు.  


వీరితో పాటుగా మరికొన్ని సంఘాలు కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. విధ్యుత్ సంఘాలు, హైకోర్ట్ లాయర్లు సంఘీభావం ప్రకటించాయి.  కాగా, ఈనెల 18 వ తేదీన మరోమారు హైకోర్టు దీనిపై విచారణ జరపబోతున్నది.  అయితే, ఈనెల 19 వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపును ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ.  ఈ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులను రంగంలోకి దించింది తెరాస ప్రభుత్వం.  


మరింత సమాచారం తెలుసుకోండి: