ప్రభుత్వ ఉద్దేశం ఏంటీ అనేది తనకు తెలియదని టీఆరెస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు  కే. కేశవరావు అన్నారు. అది తెలిస్తే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆత్మహత్యలు బాధించాయని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని కలిసి చర్చలు జరపాలన్నారు. ఈ చర్చల అంశంలో కేవలం తాను తన అభిప్రాయాన్నిమాత్రమే  వ్యక్తం చేశానన్నారు. సమ్మెతో పరిస్థితులు చేజారి పోతున్నాయనే అనుమానం వచ్చిందని కేకే అన్నారు.



ప్రెస్ రిలీజ్ కు ముందుగాని, తర్వాత గానీ, సీఎం కేసీఆర్ తో తాను మాట్లాడలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ తో తాను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానాని తెలిపారు. ఆయన ఇంకా తనకు అందుబాటులోకి రాలేదన్నారు. తన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు పెరిగాయన్నారు. తాను చర్చలు జరుపుతానని అనలేదని చెప్పారు. అయినా  సరే, మంచి జరుగుతుందని అనుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దమని చెప్పారు. సీఎం ఆదేశిస్తే ఖచ్చితంగా చర్చలకు దిగుతానని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇది పార్టీ సమస్య కాదన్నారు. ప్రభుత్వ సమస్య కార్మికులు తనతో చర్చలకు సానుకూలంగా వుండటం మంచి పరిణామమన్నారు. ప్రభుత్వం నుంచి చర్చలు జరిపేందుకు తనకు ఎలాంటి అనుమతి రాలేదని చెప్పారు.తాను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండనన్నారు.




కార్మికుల వైపే వుంటానని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు కొట్టుకోకుండా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదని కేకే అన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా సంఘీభావం తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. సమ్మెకు అనుకూలంగా ర్యాలీ తలపెట్టిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేశారు. అదే విధంగా సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద కు చేరుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అంటే కాకుండా ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. దీనితో ఆర్టీసీ కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒక దశలో స్వల్ప లాఠీ ఛార్జ్...పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: