ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎవరూ ఎందుకు నోరెత్తట్లేదు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో మనం చాలా వెనుకబడ్డాం. ఇప్పటికే రెండుసార్లు అవకాశం వచ్చింది. ఏ ఒకరిద్దరో ప్రభుత్వంపై దాడి చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఉమ్మడిగా ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని వినిపించాలి. పరిస్థితి ఇట్లాగే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తప్పవు.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా స్థాయి నాయకులకు చేస్తోన్న హితబోధ ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంపై విమర్శలు దాడిని ముమ్మరం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.


జిల్లా పర్యటన వల్ల..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా నిర్వహిస్తోన్న జిల్లా పర్యటనలు, సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారు. తెలుగుదేశానికి కంచుకోటగా భావించే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లాతో ఆయన ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి పార్టీ నాయకులను స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయాత్తం చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తరువాత టీడీపీ క్యాడర్ పూర్తిగా డీలా పడింది. వారిలో నూతనోత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.


రెండుసార్లు అవకాశం వచ్చినా..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడానికి రెండుసార్లు అవకాశం వచ్చినా, దాన్ని ఉపయోగించుకోలేకపోయామని చంద్రబాబు పార్టీ క్యాడర్ కు హితబోధ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రశ్నాపత్రం లీక్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు విషయాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో విఫలం అయ్యామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రశ్నాపత్రాల లీక్ సమయంలో తనతో పాటు మరి కొందరు మాత్రమే ముఖ్యమంత్రిని విమర్శించామని, మిగిలిన వారు ఏం చేస్తున్నారని ఆయన వ్యక్తం చేశారని సమాచారం.


కార్నర్ చేయలేకపోతున్నాం...

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత మాత్రమూ ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెబుతున్నారు. ప్రభుత్వం తరఫున ఏ చిన్న పొరపాటు చోటు చేసుకున్నా, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత క్యాడర్ మీదే ఉందని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదిలో బోటు మునక సమయంలో నెల్లూరు జిల్లాకే చెందిన జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కార్నర్ చేయలేకపోయామని చంద్రబాబు పేర్కొన్నారట. జిల్లా స్థాయి నాయకులు తమ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రులు, మంత్రులను టార్గెట్ గా చేసుకుని గ్రామ స్థాయిలో విమర్శల తీవ్రతను పెంచాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.


విమర్శల్లో ఘాటు తగ్గింది..

ప్రభుత్వంపై గానీ, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై గానీ పస లేని విమర్శలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విమర్శల్లో ఘాటు తగ్గకూడదని సూచించారని చెబుతున్నారు. నిర్మాణాత్మక విమర్శలు చేయడంపై పార్టీ క్యాడర్ దృష్టి పెట్టాలని, జిల్లా స్థాయి నాయకులు తరచూ క్షేత్రస్థాయి నాయకులతో సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని, వారికి దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. మున్ముందు ఇలాంటి పొరపాట్లు చేయకూడదని అన్నారు. ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశించి, పొరపాట్లను జనంలోకి తీసుకెళ్లగలిగితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన క్యాడర్ ను ఉత్తేజితులను చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: