ప్రకాశం జిల్లా పర్చూరు రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాప్టర్ ఇంకా క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది. గతంలో వైసీపీ తరుపున పర్చూరు ఇన్ చార్జ్ గా పని చేసిన రావి రామనాథం బాబు రీఎంట్రీతో దగ్గుబాటి భవితవ్యం గందరగోళంలో పడింది. మొన్న ఎన్నికల్లో జగన్ దగ్గుబాటికి పర్చూరు టికెట్ ఇవ్వడంతో, రావి టీడీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో దగ్గుబాటి ఓడిపోవడం, పార్టీలో యాక్టివ్ గా లేకపోవడంతో వైసీపీ అధిష్టానం మళ్ళీ రావిని పార్టీలోకి తీసుకొచ్చింది.


దీంతో దగ్గుబాటికి చెక్ పడినట్లే అని వైసీపీ వర్గాల్లో టాక్ నడిచింది. దీంతో దగ్గుబాటి పార్టీలో మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే జరగాల్సిన పనులు తెరవెనుక జరిగిపోయాయి. రావికి పర్చూరు పెత్తనం ఇచ్చేందుకు స్కెచ్ రెడీ అయింది. ఈ తరుణంలోనే జగన్ దగ్గుబాటికి ఓ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా వైసీపీలోకి తీసుకురావాలని చెప్పారని తెలిసింది.


ఉంటే భార్యాభర్తలిద్దరూ ఒకే పార్టీలో ఉండాలని జగన్ అల్టిమేటం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పురందేశ్వరి బీజేపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరడమో.. లేక దగ్గుబాటి పార్టీకి రాజీనామా చేయడం ఏదో ఒకటి చేయాలని చెప్పేశారట. దీంతో డైలమాలో ఉన్న దగ్గుబాటి అమెరికాలో ఉన్న పురంధేశ్వరి రాగానే ఏదొక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అయితే ఈలోపు పర్చూరులో జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రావి రామనాథం బాబుకు పర్చూరు పగ్గాలు అప్పగించే కార్యక్రమం తెరవెనుక జరిగిపోతుంది.


పగ్గాలు అప్పగించడం కంటే ముందు దగ్గుబాటికి దక్కాల్సిన ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి చైర్మన్‌ పదవి రామనాథం బాబుకు దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అండతో రావికి ఛైర్మన్ పదవి రానుంది. అలాగే తర్వాత పర్చూరు ఇన్ చార్జ్ పగ్గాలు రావికి అప్పగించే పని కూడా జరిగితే దగ్గుబాటి తట్టా..బుట్టా సర్దేసుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: