ఒక్కోసారి అధికారంలో ఉన్నా కాలం క‌లిసి రాక‌పోతే...ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఇక అధికార‌మే లేక‌పోతే...అంతే సంగతులు క‌దా? అలా తాజాగా 27 మంది మాజీ ఎంపీల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌రువుపోగొట్టుకోవ‌డం స‌ద‌రు ఎంపీల వంతు అయింది. గడువు ముగిసినా అధికారిక నివాసాలు ఖాళీ చేయని మాజీ ఎంపీలకు లోక్‌సభ ప్యానెల్ షాకిచ్చింది. 27 మంది మాజీ ఎంపీల నివాసాలకు నీరు, కరెంట్, గ్యాస్ సరఫరా నిలిపేయాలని ప్యానెల్ స్ప‌ష్టం చేసింది.


నిబంధ‌న‌ల ప్ర‌కారం, ఎంపీలు లోక్‌సభ రద్దయిన తర్వాత నెలలోపు బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే 16వ లోక్‌సభ రద్దయిన తర్వాత కూడా లూటీన్స్ ఢిల్లీలోని బంగ్లాల్లో నివాసముంటున్న 27 మంది మాజీ ఎంపీలు మాత్రం ఖాళీ చేయలేదు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎంపీలు అధికారిక నివాసాలు వదిలి వెళ్లకపోవడంతో..కొంతమంది ఎంపీలు వెస్టర్న్ కోర్టులోని గెస్ట్ హౌజ్ ల నుంచి తమ రాకపోకలను కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ఎంపీలు చాలా సార్లు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా దీనిపై లోక్‌సభ ప్యానెల్ సీరియస్‌గా స్పందించింది.బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ ప్యానెల్ ఆదేశాలు జారీచేసింది. 


త‌మ నివాసాల‌ను వ‌ద‌ల‌కుండా జిడ్డులా ప‌ట్టుకున్న ఆ ఎంపీల‌కు షాకిచ్చే ఆదేశాలు ఇచ్చింది. అధికారిక నివాసాలను ఖాళీ చేయని 27 మంది మాజీ ఎంపీల నివాసాలకు నీరు, కరెంట్, గ్యాస్ సరఫరా నిలిపేయాలని లోక్‌స‌భ ప్యానెల్ ఉత్తర్వులు జారీచేసింది. దీనికోసం పోలీసుల సహాయం కావాలని ప్యానెల్ కోరింది. ఈ మేర‌కు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో..ఇటు అధికారం కోల్పోయి...ఢిల్లీ వేదిక‌గా క‌క్కుర్తి ప‌డిన స‌ద‌రు ఎంపీలు ప‌రువు కూడా కోల్పోయే ప‌రిస్థితి రావ‌డం ఖాయ‌మైంది. కాగా, ప్యానెల్ నిర్ణ‌యంపై ఆ ఎంపీలు ఇంకా స్పందించ‌లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: