పవన్ కళ్యాణ్ రాజకీయం ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదంటున్నారు. ఆయన ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయన ఒక్క జగన్ని మాత్రమే ప్రశ్నించడానికి  వచ్చినట్లున్నారు అని ఇపుడు వైసీపీ నేతలే విరుచుకుపడుతున్నారు. పవన్ నోరెత్తితే జగన్ గురించే మాట్లాడుతారు. జగన్ విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కూడా పవన్ టార్గెట్ ఆయనే అయిపోయారంటున్నారు.


రాజకీయ పార్టీగా ఉన్నపుడు విమర్శలు చేయడంతో తప్పులేదు. కానీ మంచి పనులను మెచ్చుకుని చెడ్డను నిలదీస్తే అపుడు విశ్వసనీయత ఉంటుంది. ఇదే మాటను పదే పదే పవన్ చెబుతూ వచ్చారు. అయితే ఆయన మాత్రం ఆచరణలో విఫలమవుతున్నారని అంటున్నారు. పవన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు నాలుగేళ్ళ పాటు కనీసం ఏ విషయాన్ని ప్రశ్నించలేదన్నది ఇపుడు వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.


రైతు రుణ మాఫీ అని చెప్పి తన మొత్తం అధికారంలో రెండు విడతలు చంద్రబాబు ఎగ్గొట్టారు,  అంతేనా మొత్తం లబ్దిదారులను నాలుగవ వంతుకు కుదించేశారు. ఇక డ్వాక్రా మహిళలకు రుణాలను కూడా రద్దు చేయలేదు. నిరుద్యోగ భ్రుతి ఎన్నికల ఏడాదిలో కొద్ది నెలల ముందు కేవలం వేయి రూపాయలే ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు కూడా అపుడే పెట్టారు. ఇలా ఇచ్చిన ప్రతీ హామీ తుంగలోకి తొక్కితే నాడు పవన్ ఉలుకూ పలుకూ లేదు. ఇపుడు మాత్రం జగన్ ప్రమాణం చేసిన తరువాత రోజునే  ప్రతీ విషయాన్ని నిలదీస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరిట జగన్ 13,500 రూపాయలు ఇస్తున్నారు. ఇందులో కేంద్రం మొత్తం ఆరువేలు ఉందని పవన్ అభ్యంతరం పెడుతున్నారు.


నిజానికి కేంద్రం ఏపీకి ఎంతో సాయం చేయాలి. విభజన నిధులు దండీగా ఇవ్వాలి. పైగా ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాజధానికి, పోలవరానికి సరిగా నిధులు లేవు. ఇపుడు రైతుల విషయంలో ఇచ్చారని చెప్పి ఆ మొత్తాన్ని ముట్టుకోవద్దని పవన్ చెప్పడంలో అర్ధం లేదుకదా. కేంద్రం అంటే అది కూడా ప్రజల సొమ్మే కదా. పైగా నాటి సర్కార్ మాదిరిగా స్టిక్కర్లు అంటించి తమ పధకం అని జగన్ చెప్పుకోలేదుగా.  ఇక తన హామీని నాలుగు నెలల్లోనే జగన్ అమలు చేస్తున్నారు.


పైగా ఏపీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉంది. రేప్పొద్దున కేంద్రం భారీగా సాయం చేసినా, నిధులు పెరిగినా మరింతగా రైతులకు జగన్ సాయం చేస్తారేమో, ఇచ్చిన దాన్ని మెచ్చకుండా తప్పుపట్టడం అంటే పవన్ ఫక్త్ పొలిటీషియన్ గానే మాట్లాడుతున్నారని అంటున్నారంతా. పైగా టీడీపీ అడుగుజాడల్లో పవన్ నడుస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారంటే పవన్ ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: