కడప జిల్లా.. సీఎం జగన్ సొంత జిల్లా.. ఈ జిల్లాకు జగన్ తండ్రి వైఎస్సార్ పేరు కూడా పెట్టారు. అలాంటి వైఎస్ సొంత జిల్లాలో ఓ భారీ భూకుంభ కోణమే జరిగిందన్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష ఎకరాల భూకుంభ కోణమట. అధికారులూ, బడాబాబులూ కలిసి సాగించిన భూ దందా ఇది అంటున్నారు వామపక్షలా నేతలు.


వివరాల్లోకి వెళ్తే... కడప జిల్లా రాజంపేట రెవిన్యూ డివిజన్ లో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆరోపణలు వస్తున్నాయి. రాజంపేట, బద్వేలు, కాశినాయన, ఒంటిమిట్ట,సిద్ధవటం మండలాల్లో ఈ దందా జరిగిందట. అప్పటి ఓ కలెక్టర్ దీనిపై పూర్తి నివేదిక ఇచ్చినా ప్రభుత్వం చూసీచూడనట్టు వదిలేసిందట. లక్ష ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ఆక్రమణదారులతో కుమ్మక్కై అప్పనంగా పట్టాలు చేసి ఇచ్చారట.


వ్యవసాయంతో సంబంధం లేని వారికి కూడా రెవిన్యూ అధికారులు పట్టాలు అందించారట. ఈ భూ కుంభకోణంపై గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ బాబూరావు నాయుడు విచారణ జరిపించారట. కానీ ఆయన ఇచ్చిన నివేదికను అప్పటి తెలుగుదేశం సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదట. ఈ వివరాలన్నీ ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించిన సీపీఎం నేత రాఘవులు వెల్లడించారు. కడప జిల్లాలో భారీగా జరిగిన భూ కుంభకోణంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాస్తానంటున్నారాయన.


ప్రభుత్వ భూమిని కాపాడటంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటున్నారు రాఘవులు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అయినా ఈ లక్ష ఎకరాల భూకుంభకోణంపై దృష్టి పెట్టాలని ఆయన కోరుతున్నారు. సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడైన బీవీ రాఘవులు ఇటీవల కడప జిల్లాలో కొన్నాళ్లు పర్యటించారు. ఈ భూకుంభకోణానికి సంబంధించిన వివరాలు సేకరించారు. మరి ఈ ఆరోపణలపై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: