ఏపీలో రంజైన  రాజకీయం సాగుతోంది. సరిగ్గా అయిదేళ్ళ క్రితం సాగిన రాజకీయానికి ఇది భిన్నంగా ఉంది. ఎందుచేతనంటే అపుడు సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్. అయితే నాడు బాబు తీరు, అప్పటి పాలిట్రిక్స్ అవన్నీ వేరే కధ. అందరికీ తెలిసిన కధ. ఇపుడు మాత్రం చంద్రబాబులో కొత్త బాబు కనిపిస్తున్నారు. అసలు మా బాబేనా అని తమ్ముళ్ళు ఆశ్చర్యపోయే బాబు ఇపుడున్నారు.


ఈ బాబుకు నిలువెల్లా అసహనమే. చంద్రబాబు నిజానికి సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయనకు ఎపుడు ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు. కానీ దాన్ని పక్కన పెట్టి ప్రవర్తిస్తూండడమే అసలైన వింత. దాదాపుగా ప్రతీ రోజూ మీడియాని ఫేస్ చేస్తున్నారు బాబు. జగన్ని ఫుల్ గా తిట్టేస్తున్నారు. అంతే కాదు జిల్లాల టూర్ అంటున్నారు. అక్కడిని వెళ్ళి కార్యకర్తల మధ్యన  జగన్నామస్మరణ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబులో ఇంతలా అసహనం  ఎందుకు పెరిగిపోతోందో అర్ధం కావడం లేదు. ఆయన ప్రతీ రోజూ చెప్పిన మాటలనే చెబుతున్నారు తిట్లు శాపనార్ధాలు మాత్రం కొత్తగా ఉంటున్నాయి.


దాంతో అనుకూల మీడియా తప్ప కవరేజ్ కూడా పెద్దగా రావడంలేదంటున్నారు. ఇక ఇప్పటి నుంచే జగన్ని విమర్శించడం వల్ల రాబోయే రోజుల్లో నిజంగా జగన్ సర్కార్ పెద్ద తప్పు చేసినా చంద్రబాబు విమర్శలలో సీరియస్ నెస్ ఉండదని తమ్ముళ్ళే అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు అంటే విమర్శలు చేస్తూనే ఉంటారన్న పేరు సంపాదించాక ఆయన నిజంగా సీరియస్ సమస్యను టేకప్ చేసినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదని అంటున్నారు. ఇక బాబు ఇంతలా గొంతు చించుకున్నా మరో నాలుగున్నరేళ్ళ పాటు అధికారం జగన్ వద్దనే ఉంటుంది. ఈ సత్యం తెల్సిన తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉంటున్నారు. బాబు మాత్రమే రెచ్చిపోతున్నారు.


ఇపుడు ఎన్నికల కధ కూడా అందరికీ తెలిసిందే. ప్రజలు అన్నీ గమనించి జాగ్రత్తగా ఓటు చేస్తున్నారు తప్ప పదే పదే తిట్టి బదనాం చేద్దామన్న కుదిరే కధ కాదు, ఇన్నీ తెలిసి కూడా బాబు ఇలా ఆవేశం ప్రదర్శిస్తున్నారంటే దానికి కారణం జగన్ పాలనాపరంగా దూకుడు పెంచడమేనని అంటున్నారు. జగన్ రోజుకో కొత్త పధకాన్ని అమలు చేస్తున్నారు. దాంతో అది ఎక్కడ ప్రజల్లోకి వెళ్లి సక్సెస్ అవుతుందోనన్న కంగారే బాబుని కుదురుగా ఉండనీయడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన తిట్ల దండకం అందుకుని ఒకేటే ఉతుకుడు మొదలెడుతున్నారని కూడా కామెంట్స్ పడుతున్నాయి. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో జగన్ యాక్షన్ చేస్తూంటే బాబు రియాక్షన్ ఇస్తున్నారన్న మాట.



మరింత సమాచారం తెలుసుకోండి: