వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటినుండి అమలులోకి వచ్చింది. రైతుల ఖాతాలలో 7,500 రూపాయలు జమ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నవరత్నాలలో భాగంగా అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్ 14వ తేదీన మరో 1,000 రూపాయలు పెంచుతూ ప్రతి రైతుకు 13,500 రూపాయలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

కానీ రైతు భరోసా పథకాన్ని పీఎం కిసాన్ తో కలిపి అమలు చేయటం పట్ల రైతుల నుండి కొంత వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయం గురించి పూర్తి స్పష్టత ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ నుండి ఈ పథకాన్ని పీఎం కిసాన్ తో కలిపి ఇస్తారనే ఆరోపణలు వచ్చినా ఆ ఆరోపణల గురించి ప్రభుత్వం గతంలో స్పందించలేదు. కానీ ప్రభుత్వం ఈ పథకాన్ని పీఎం కిసాన్ తో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తోంది. 
 
మరోవైపు రైతు భరోసా నగదు మూడు విడతల్లో జమ కావటం కూడా రైతుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రభుత్వం ఒకే విడతలో నగదు జమ చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు రైతుల నుండి వ్యక్తమవుతున్నాయి. మూడు విడతల్లో నగదు జమ కావటం వలన పెద్దగా ఉపయోగం ఉండదని రైతులు చెబుతున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తింపజేయటం పట్ల కౌలు రైతులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రభుత్వం మూడు విడతల్లో కాకుండా ఒకే విడతలో నగదు జమ చేయాలని పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా రైతు భరోసా పథకాన్ని వేరుగా అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. మరి రైతుల సంక్షేమం కొరకు నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం రైతుల విన్నపాల్ని పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: