మూడు సంవత్సరాల క్రితం టెలికాం రంగంలో జియో రాకతో విప్లవాత్మక మార్పులొచ్చాయి. కానీ కొన్ని రోజుల క్రితం జియో ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై ఐయూసీ చార్జీలు విధించటంతో మిగతా మొబైల్ నెట్ వర్క్ కంపెనీలు కూడా చార్జీల పెంపు గురించి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
ఎయిర్ టెల్ సీఈవో, ఎండీ గోపాల్ విఠల్ టారిఫ్ లు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలు చేస్తున్న టారిఫ్ లతో నిలదొక్కుకోవడం కష్టమని గోపాల్ విఠల్ వ్యాఖ్యానించారు. ఐయూసీ చార్జీల పేరుతో జియో ఒక నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేయటాన్ని గోపాల్ విఠల్ ఖండించారు. 5జీ సేవలు ఖరీదైన వ్యవహారంగా మారతాయని 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా ఎక్కువని గోపాల్ విఠల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
డిజిటల్ ఇండియా కల సాకారం కావాలంటే టెలికాం రంగంలో పెట్టుబడులు పెరగాలని గోపాల్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంటేనే ముందుకొస్తారని గోపాల్ చెప్పారు. జియో సంస్థ మాత్రం ఎయిర్ టెల్ లాంటి పాత ఆపరేటర్లకు ఐయూసీ చార్జీలు అనూహ్య లాభాలు అందిస్తాయని పేర్కొంది. ఐయూసీ చార్జీల గడువు పొడిగించటం వలన వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బ తీసినట్లు అవుతుందని జియో వ్యాఖ్యానించింది. 
 
జియో సంస్థ ఇతర టెల్కోలు కూడా ఐయూసీ చార్జీలను విధిస్తున్నాయని కానీ ఈ విషయం వినియోగదారులకు చెప్పకుండా దాచివేస్తున్నాయని పేర్కొంది. జియో ప్రెసిడెంట్ మ్యాథ్యూ ఊమెన్ పోటీ సంస్థలు పారదర్శకత పాటించటం లేదని ఆరోపణలు చేశారు. ఎయిర్ టెల్ సీఈవో, ఎండీ గోపాల్ విఠల్ చేసిన వ్యాఖ్యలతో టారిఫ్ చార్జీలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎయిర్ టెల్ నిజంగా చార్జీలు పెంచుతుందా? లేదా? చూడాలి 


మరింత సమాచారం తెలుసుకోండి: