సినిమాకు వెళ్తున్నాము అంటే రోజు సమయంలో కనీసం ఐదు గంటలు సినిమాకోసం ఖర్చు చేయాల్సి వస్తున్నది.  ఇంటి నుంచి బయలుదేరి ట్రాఫిక్ దాటుకొని థియేటర్ కు వెళ్లి సీట్లో కూర్చుంటారు.  సరే ఇచ్చిన సమయానికి షో వేస్తారా అంటే అది లేదు.  చెప్పిన సమయానికి ముందు కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు కమర్షియల్ యాడ్స్ పేరుతోనూ, ఫీచర్ ట్రైలర్స్ పేరుతోనూ పదిహేను నిమిషాలు వృధా అవుతుంది.  


అది కామన్ దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోరు.  సినిమాకు వెళ్లడం అంటేనే దాదాపుగా సమయాన్ని వృధా చేసుకుంటున్న లెక్కే కదా మరి.  ఇప్పుడున్న  బిజీ లైఫ్ లో సినిమాకు రెగ్యులర్ గా వెళ్తున్నారు అంటే వాళ్లకు మరో పని లేనట్టే అని అనుకోవాలి.  ఇది వేరే విషయం అనుకోండి.  అయితే, ఇలా సినిమా పది నిమిషాలు ఆలస్యం అయ్యిందని చెప్పి ఓ వ్యక్తి పోలీస్ కేసు పెట్టాడు.  దీన్ని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకోవడంతో కోర్డు వరకు వెళ్ళింది.  ఈ సంఘటన ఎక్కడో జరిగింది అనుకుంటే పొరపాటే.. జరిగింది హైదరాబాద్ నగరంలోనే.  


వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని కేపీహెచ్బి కాలనీలోని మంజీరా మాల్స్ సినిమా థియేటర్లో ఈనెల 8 వ తేదీన సినిపోలిస్ లో చాణక్య సినిమా చూసేందుకు ఓ ప్రేక్షకుడు వెళ్ళాడు.  సాయంత్రం 4.40 గంటలకు సినిమా ప్రదర్శించాల్సి ఉన్నది.  కానీ సినిమాకు ముందు యాడ్స్ పేరుతో దాదాపు పదినిమిషాలు వృధా చేశారు.  దీంతో సదరు ప్రేక్షకుడు చాలా ఫీల్ అయ్యాడట.  పదినిమిషాలు ఇలా వృధా కావడంతో ఇబ్బంది పడ్డాడు.  


సినిమా చూసిన తరువాత బయటకు వచ్చి కేపీహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సినిమా చెప్పిన సమయానికి కాకుండా పదినిమిషాలు ఆలస్యంగా వేశారని, కమర్షియల్ యాడ్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఆలస్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.  ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారు.  కోర్టు నుంచి అనుమతి లభించడంతో పోలీసులు సదరు థియేటర్ కు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.  అదే పదినిమిషాలు కళ్ళుమూసుకొని కూర్చుంటే.. అందరిలా మామూలుగానే ఉండేది.  అసలు ఈ న్యూస్ బయటకు వచ్చేది కాదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: