అందరూ అనుకుంటున్నట్లు తాను ప్యాకేజీ పవనే అని జనసేనాని నిరూపించుకోదలచుకున్నట్లున్నారు. తాజాగా ట్విట్టర్ వేదికగా జగన్మోహన్ రెడ్డిపై చేసిన కామెంట్లే నిదర్శనం. రైతు భరోసా పథకంలో జగన్ ఇస్తానన్న డబ్బులు ఇవ్వనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 12500 ఇస్తానన్నారు.

 

అయితే ఇటువంటి పథకాన్నే కేంద్రం కూడా అమలు చేస్తోంది కాబట్టి  రైతులకు ఇస్తానన్న మొత్తంలో సగమే ఇచ్చారు. అదే సమయంలో కేంద్రం పట్టించుకోని లక్షలాది కౌలు రైతులకు మాత్రం పూర్తిగా రూ. 13500 ఇస్తున్నారు.  నిజానికి రైతులమని చెప్పుకుంటున్న చాలామంది అసలు వ్యవసాయమే చేయటం లేదు. తమ పొలాలను కౌలుకు ఇచ్చేసి తాము ఎక్కడో ఉంటున్నారు.  ఈ విషయాలు అందరికీ తెలుసు.

 

కానీ పవన్ కూడా చంద్రబాబునాయుడు, లోకేష్ మాదిరిగా అవేమీ పట్టించుకోకుండా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి జగన్ పై ఆరోపణలు చేస్తున్నారు.  చంద్రబాబంటే వైసిపి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేకపోతున్నారు. మరి పవన్ కు ఏమైంది ? మంచిని మంచిగాను చెడును చెడుగాను చూడలేకపోతున్న పవన్ తాను పార్టీని పెట్టిందే ప్రశ్నించటానికి చెప్పటంలో అర్ధముందా ?

 

ప్రశ్నించటమంటే జగన్ ను మాత్రమే ప్రశ్నించటమా ? ఐదేళ్ళు అధికారంలో ఉన్న చంద్రబాబును పవన్ ఏమాత్రం ప్రశ్నించారు ? ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేసిందే లేదు. మరి అప్పుడు పవన్ ఎందుకు నోరుమూసుకు కూర్చున్నట్లు ? 

 

ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని జనాలు ఎంతగా డిమాండ్ చేసినా పట్టించుకోని చంద్రబాబును పవన్ ఎందుకు  ప్రశ్నించలేదు ?  ఐదేళ్ళు లేవని నోరు జగన్ అధికారంలోకి రాగానే మాత్రం ఎందుకు లేస్తోంది ? చంద్రబాబు ఏమి మాట్లాడితే పవన్ కూడా అదే మాట్లాడుతారా ? తనకంటూ సొంత ఆలోచనలుండవా ? ఇదంతా చూస్తున్నారు కాబట్టే జనాలు పవన్ ను ప్యాకేజీ పవన్ అంటున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: