తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరంలో దారుణమైన ఘటన జరిగింది. తొండంగి అర్బన్  ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న సత్యనారాయణను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సత్యనారాయణను హత్య చేసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. 

 

 

 

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం జగన్ ఈ ఘటనపై స్పందించారు. కేసును సీరియస్ గా తీసుకుని నిందితులను త్వరగా పట్టుకోవాలని డీజీపీ సవాంగ్‌ ను ఆదేశించారు. ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో డీజీపీ సవాంగ్ మాట్లాడారు. ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి త్వరగా నిందితులను పట్టుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. గతంలో ఓ వర్గంపై వార్త రాసిన సత్యనారాయణపై దుండగులు గత నెలలో దాడి చేశారని సమాచారం. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారని సమాచారం. ఈసారి దుండగులు పక్కా ప్లాన్ తో సత్యనారాయణను హత్య చేశారని తెలుస్తోంది. హత్య ఎవరు చేసారనేదానిపై ఇప్పటికి వరకూ ఆధారాలు లభించలేదు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

 

ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. జర్నలిస్ట్ హత్యను ఆటవిక చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా ఉందని.. భయపెడితేనే తప్ప కలానికి సంకెళ్లు వేయలేమని హత్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని అన్నారు. సత్యనారాయణ హత్య వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అది పోలీసుల వరకు వెళ్లినప్పటికీ రక్షణ కల్పించకపోవడం దారుణమని అన్నారు. సత్యనారాయణ కుటుంబానికి సానుభూతి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: