విద్యుత్ వివాదంలో తాజాగా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిందనే చెప్పాలి. పవన, సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చే విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపేస్తు హై కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. సౌర, పవన్ విద్యుత్ కొనుగోళ్ళకు సంబంధించి ఉత్పత్తి కంపెనీలకు ప్రభుత్వం లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) ఇవ్వటానికి 15వ తేదీయే గడువు.

 

అయితే కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తసుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రతీ నెల ఎల్సీ ఇచ్చి అంటే సుమారు రూ 600 కోట్లు చెల్లిస్తే కానీ విద్యుత్ సరఫరా చేసేందుకు ఉత్పత్తి కంపెనీలను అంగీకరించేది లేదని కేంద్రం కొత్తగా ఓ నిబంధన తెచ్చింది. అంటే ఈ నిబంధన దేశమంతటికీ వర్తిస్తుంది లేండి. మిగితా రాష్ట్రాల సంగతెలాగున్నా ఏపి ఆర్ధిక పరిస్ధితి బావోలేదు కాబట్టి జగన్ ప్రభుత్వానికి మాత్రం ఇబ్బందే.

 

ఎల్సీలు ఇవ్వకపోతే విద్యుత్ సరఫరా నిలిపేయాలంటూ కేంద్రం ఉత్పత్తి సంస్ధలకు కూడా ఆదేశాలిచ్చిందట. అంటే ప్రభుత్వం గనుక ఎల్సీలు ఇవ్వకపోతే విద్యుత్ సరఫరా రాదు కాబట్టి రాష్ట్రంలో భారీ కోతలు తప్పవు. ఈ ప్రమాదాన్ని ముందుగా అంచనా వేసిన ప్రభుత్వం వెంటనే కేంద్ర ఆదేశాలకు విరుద్ధంగా కోర్టుకెక్కింది. దాంతో కోర్టు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత కేంద్రం ఆదేశాలపై స్టే ఇచ్చింది.

 

కోర్టు జోక్యంతో తక్షణ సమస్య నుండి ఏపి గట్టెక్కినట్లే అనుకున్నా ప్రమాదమైతే పొంచి ఉందన్నది వాస్తవం. అసలు ఈ సమస్యంతా  జగన్ అధికారంలోకి రాగానే విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించగానే మొదలైంది.  విద్యుత్ టారిఫ్ లను జగన్ సమీక్షించటం చంద్రబాబునాయుడుతో పాటు కేంద్రానికి కూడా ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే పదే పదే జగన్ సమీక్షలకు కేంద్రం అడ్డుపడుతున్న విషయం చూస్తున్నదే.

 

సమీక్షల వల్ల ధరలు తగ్గితే ప్రజాధానం ఆదా అవుతుందని జగన్ వాదిస్తుంటే ఎట్టి పరిస్ధితుల్లోను సమీక్షలు చేయకూడదని చంద్రబాబు, కేంద్రమంత్రి ఆర్కె సింగ్ వాదిస్తున్నారు. మధ్యలో చంద్రబాబు ఎందుకు పిక్చర్లోకి వచ్చారంటే అవసరం లేకపోయినా పవన, సౌర విద్యుత్ కంపెనీలతో 25 ఏళ్ళు అధిక ధరలకు ఒప్పందాలు చేసుకున్నది చంద్రబాబే. అందుకనే తెరవెనుక నుండి చంద్రబాబు కేంద్రమంత్రిని మ్యానేజ్ చేస్తున్నారేమో అనే అనుమానాలు వినబడుతున్నాయి. మరి ఈ విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: