రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదానికి సంబంధించిన కేసు విచారణలో ఓ షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో బాబ్రీ మసీదు తరఫున ప్రధాన కక్షిదారుగా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డు కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయోధ్య భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇదివరకే ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ ప్యానెల్ కమిటీ సభ్యులు ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

 

దీనిపై ముస్లిం ప్రతినిధుల తరఫు న్యాయవాది రాజీవ్ ధవన్ ఈ విషయాన్ని తోసిపుచ్చారు. తాము కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున ఇప్పటిదాకా ఎలాంటి అఫిడవిట్ లేదా విజ్ఞప్తులు గానీ తనకు అందలేదని తేల్చి చెప్పారు. వక్ఫ్ బోర్డు తీసుకునే నిర్ణయమే దీనిపై చివరిదని తేల్చి చెప్పారు.

 

తుది విచారణలో షాకింగ్ ట్విస్ట్..

భావిస్తోన్న బాబ్రీ మసదు తరఫున ఉత్తర్ ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. హిందూ ధార్మిక సంఘాలైన నిర్మోహి అఖాడా, రామ్ లల్లా విరాజ్ మాన్ వేసిన కేసులతో కలిపి దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తోంది. కేసు విచారణకు బుధవారం నాటితో ముగియబోతోంది. ఈ పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాన కక్షిదారు సున్నీ వక్ఫ్ బోర్డు కేసును వెనక్కి తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు మధ్యవర్తిత్వ ప్యానెల్ కమిటీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి వెల్లడించింది.

 

కారణాలేంటీ?

సున్నీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జెడ్ ఏ ఫారూఖీ అక్రమాలకు పాల్పడటమే దీనికి ప్రధాన కారణమని తేలింది. సున్నీ వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న కొన్ని భూములను ఫారూఖీ ఛైర్మన్ హోదాలో అక్రమంగా విక్రయించినట్టుగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్దారించింది. మరింత లోతుగా విచారణ చేపట్లడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఫారూఖీ అక్రమాలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే సీబీఐ రంగంలోకి దిగింది. ఆయనపై కేసు నమోదు చేసింది. త్వరలో ఆయనను అదుపులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఫారూఖీపై కేసు వ్యవహారంలో వక్ఫ్ బోర్డు ప్రతినిధుల్లో భేదాభిప్రాయాలు

వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సిన ఛైర్మనే అక్రమాలకు పాల్పడిన ఉదంతం బోర్డు సభ్యుల్లో ప్రకంపనలను పుట్టించింది. వారి మధ్య విభేదాలకు కారణమైంది. సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీని ప్రభావం రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం వివాదం కేసుపై పడినట్లు కనిపిస్తోంది. సీబీఐ ఫారూఖీపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం వల్ల అయోధ్య భూ వివాదం కేసు సుప్రీంకోర్టులో నీరు గారవచ్చని, బలహీన పడే అవకాశం ఉందని సున్నీ వక్ఫ్ బోర్డు సభ్యులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మధ్యవర్తిత్వ ప్యానెల్ కమిటీ సుప్రీంకోర్టు ధర్మాసనానికి విన్నవించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: