కేసీఆర్ రంగంలోకి దిగితే చాలు ప‌రిస్థితుల‌న్నీ ఒక్క‌సారిగా మారిపోతాయి.. జ‌నంలో గులాబీ మూడ్‌లోకి వచ్చేస్తారు. ఎక్క‌డ .. ఎప్పుడు..ఎవ‌రిపై ఎలా దాడి చేయాలో.. జ‌నాన్ని త‌న‌దారిలోకి ఎలా తెచ్చుకోవాలో కేసీఆర్‌కు తెలిసినంత‌గా మ‌రెవ్వ‌రికీ తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు.. అయితే.. తాజా ప‌రిస్థితులు మాత్రం కేసీఆర్‌కు అత్యంత సంక్లిష్టంగా మారుతున్నాయి. ప్ర‌ధానంగా హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను గులాబీద‌ళ‌ప‌తి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు. ఎలాగైనా గెలిచి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను నేల‌కేసి కొట్టి, జ‌నంలో త‌మ‌కు తిరుగులేద‌న్న సంకేతాల‌ను బ‌లంగా ఇవ్వాల‌ని చూస్తున్నారు. 


కానీ.. ప‌రిస్థితులు మాత్రం అంత సుల‌భంగా ఆయ‌న‌కు లొంగేలా లేవు. అనేక అంశాలు హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది ఆర్టీసీ కార్మికుల స‌మ్మె. నిజానికి.. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుద‌ల కాగానే.. అంద‌రికంటే ముందుగానే టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా సైదిరెడ్డిని ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆ త‌ర్వాత ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను పార్టీవ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్నారు. ఈ మేర‌కు ఈ నెల 4న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. సుమారు 70మంది ప్ర‌తినిధుల‌ను నియ‌మించి నియోజ‌క‌వ‌ర్గాన్ని మోహ‌రించారు. ఈనెల 18న సీఎం కేసీఆర్ స‌భ ఉంటుంద‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే.. ఆర్టీసీ కార్మికుల స‌మ్మెతో ఒక్క‌సారిగా ప‌రిస్థితులు మారిపోయాయి. 


కేటీఆర్ కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌కుండా కేవ‌లం హైద‌రాబాద్ నుంచి దిశానిర్దేశం  చేస్తున్నారు. ఇక సీఎం స‌భ కూడా జ‌ర‌గ‌డం క‌ష్ట‌మ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నంగా ఒక‌రోజు ముందుగానే ఈనెల 17న భారీ బ‌హిరంగ నిర్వ‌హిస్తున్నారు. హుజూర్‌న‌గ‌ర్‌లో స‌భ నిర్వ‌హించ‌కుంటే.. ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌న్న ఉద్దేశంతోనే త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే కేసీఆర్ స‌భ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులంతా కూడా ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. 


తాజా ప‌రిస్థితుల‌తో సామాన్య జ‌నం కూడా తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఇలా పూర్తి ప్ర‌తికూలంగా ఉన్న ప‌రిస్థితుల్లో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ హుజూర్‌న‌గ‌ర్ జ‌నం మూడ్ మారుస్తారా..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో సారు, కారు, ప‌ద‌హారు అనే నినాదంతో ముందుకు వెళ్లిన కేసీఆర్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ఎదురుదెబ్బ‌లు త‌ప్ప‌లేదు. తాజాగా.. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ప్ర‌తికూల ఫ‌లితం వ‌స్తే.. టీఆర్ఎస్ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా మార‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: