ఆర్టీసీ కార్మికుల సమ్మె విష‌యంలో..తెలంగాణ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. స‌మ్మెపై క‌ఠినంగా, ప్రణాళిక‌బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌భుత్వం...రవాణా, రెవెన్యూ, ఆర్టీసీ, పోలీసు అధికారులు సమన్వయంతో ముందుకెళ్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు ఓ వైపు...చ‌ర్చ‌ల ఎత్తుగ‌డ మ‌రోవైపు సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 11వ రోజు జ‌రిగిన స‌మ్మెలో 62 శాతం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. రెండ్రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.


సీఎం కేసీఆర్ ఆదేశాల నేప‌థ్యంలో...రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రీజినల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వందశాతం బస్సులు నడిపేలా సత్వర చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు. ఆర్టీసీ పరిధిలోని గరుడ, రాజధాని ఏసీ బస్సులు మినహా ప్రతి బస్సు నిర్దేశించిన రూట్లలో నడువాలని చెప్పారు. తెలంగాణ‌  రాష్ట్రవ్యాప్తంగా 4,192 మంది తాత్కాలిక డ్రైవర్లు, 4192 మంది తాత్కాలిక కండక్టర్లు విధులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. 4,192 ఆర్టీసీ, 1,952 అద్దె బస్సులు కలుపుకొని 6,144 బస్సుల ద్వారా ప్రయాణికులకు సేవలందించినట్టు పేర్కొన్నారు. 


మ‌రోవైపు స‌మ్మె విర‌మ‌ణ కోసం హైకోర్టు సైతం ప‌లు సూచ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలు జరుపాలని, ప్రభుత్వం కూడా రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించేలా చర్చలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. కార్మికుల డిమాండ్లలో ఒకటైన ఆర్టీసీ ఎండీ నియామకాన్ని వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. పండుగ సీజన్‌లో సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై ఆగ్రహం వ్యక్తంచేసిన హైకోర్టు.. డిమాండ్లు సాధించుకునే క్రమంలో నిరసన తెలియజేయటానికి చాలామార్గాలు ఉన్నాయని పేర్కొన్నది. మహాభారత యుద్ధానికి ముందు కూడా చర్చలు జరిగాయని, చర్చలు విఫలం అయినప్పుడే యుద్ధం మొదలైందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు ఆహ్వానిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి విచారణ అనంతరం మీడియాకు చెప్పారు. ప్రస్తుతానికి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: