అత్యంత సున్నిత అంశ‌మైన అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశంలో...కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అయోధ్య‌లోని రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీమ‌సీదు వివాదాస్ప‌ద కేసులో  వాద‌న‌లు ముగిశాయి. సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు సాగిన వాద‌న‌లు నేటి సాయంత్రంతో ముగిశాయి. రామ‌జ‌న్మ‌భూమి-బాబ్రీ మ‌సీదు కేసులో తీర్పును సుప్రీం రిజ‌ర్వ్‌లో ఉంచింది. కేసుకు సంబంధించిన రాత‌పూర్వ‌క ద‌స్త్రాల‌ను మ‌రో మూడు రోజుల్లో స‌మ‌ర్పించ‌నున్నారు. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు డెడ్‌లైన్ ఉన్నా.. ఓ గంట ముందే సుప్రీం ఈ కేసులో వాద‌న‌లు ముగించింది. హిందువుల మ‌నోభావాల‌కు కేంద్ర బిందువుగా మారిన అయోధ్య కేసులో.. తుది తీర్పు న‌వంబ‌ర్ 17వ తేదీలోగా వెలుబ‌డే అవ‌కాశాలు ఉన్నాయి.  చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ రిటైర్ అయ్యే లోపు అయోధ్య తీర్పు వ‌స్తుంద‌ని ఆశిస్తున్నారు.


సుప్రీం ధ‌ర్మాస‌నంలో చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్‌, జ‌స్టిస్ బోడే, చంద్ర‌చూడ్‌, అశోక్ భూష‌ణ్‌, అబ్ధుల్ న‌జీర్‌లు ఉన్నారు. వివాదాస్ప‌ద స్థ‌లం గురించి అన్ని పార్టీలు త‌మ వాద‌న‌లు వినిపించాయి. వ‌క్ఫ్ బోర్డు, హిందూ మ‌హాస‌భ‌, నిర్మోహి అఖాడాలు త‌మ అభిప్రాయాలు విన్న‌వించాయి. సీనియ‌ర్ న్యాయ‌వాదులు కే ప‌ర‌శ‌ర‌న్‌, సీఎస్ వైద్య‌నాథ‌న్‌లు.. రామ్‌ల‌ల్లా త‌ర‌పున వాదించారు. న్యాయ‌వాది ఎస్‌కే జైన్ .. నిర్మోహి అకాడా త‌ర‌పున వాదించారు. రాజీవ్ థావ‌న్‌, మీనాక్షి అరోరా, శేఖ‌ర్‌న‌ప‌డేలు సున్నీవ‌క్ఫ్ బోర్డు త‌ర‌పున వాదించారు. కాగా, అయోధ్య కేసును డీల్ చేసేందుకు ఓ మ‌ధ్య‌వ‌ర్తి ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ఎఫ్ఎం ఖ‌లీఫుల్లా, శ్రీశ్రీ ర‌విశంక‌ర్‌, సీనియ‌ర్ అడ్వ‌కేట్ శ్రీరాం పంచూలు మ‌ధ్య‌వ‌ర్తులుగా ఉన్నారు. కానీ వారి మ‌ధ్య‌వ‌ర్తిత్వం విఫ‌ల‌మైంది. 


మ‌రోవైపు ఈ వివాదాస్ప‌ద అంశం విచార‌ణ ప్ర‌త్యేక రికార్డును సృష్టించింది. ఈ ఏడాది ఆగ‌స్టు 6వ తేదీ నుంచి రోజువారీగా అయోధ్య కేసులో వాద‌న‌లు సాగాయి. రాజ్యాంగ ధ‌ర్మాస‌నం 40 రోజుల పాటు విచారించింది. దీంతో సుప్రీం చ‌రిత్ర‌లో అతిసుదీర్ఘ వాద‌న‌లు జ‌రిగిన రెండవ కేసుగా రికార్డులో నిలిచింది. గ‌తంలో కేశ‌వానంద భార‌తి కేసులో సుప్రీం ధ‌ర్మాస‌నం అత్య‌ధికంగా 68 రోజుల పాటు విచారించింది. ఇక ఆధార్ కేసును అత్యున్న‌త న్యాయ‌స్థానం 38 రోజుల పాటు విచారించింది. 


ఇదిలాఉండ‌గా, చివ‌రి నిమిషంలో ఈ కేసు నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని సున్నీ వ‌క్ఫ్ బోర్డు నిర్ణ‌యించింది. సున్నీ వ‌క్ఫ్ బోర్డులో ఉన్న స‌భ్యుల మ‌ధ్య వివాదం చెల‌రేగ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని తెలిసింది. వివాద‌స్ప‌ద అంశం నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని వ‌క్ఫ్ బోర్డు నిర్ణ‌యించిన‌ట్లు మ‌ధ్య‌వ‌ర్తి ప్యానెల్ సుప్రీంకోర్టుకు వెల్ల‌డించింది.  టైటిల్ సూట్ నుంచి కేసును ఉప‌సంహ‌రించాల‌ని నిర్ణ‌యించామ‌ని, అయోధ్య‌లో ఉన్న 22 మ‌సీదుల మెయింటేనెన్స్ చూసుకోవాల‌ని వ‌క్ఫ్ బోర్డు ప్ర‌భుత్వాన్ని కోరింది. వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్ జేఏ ఫారుకిపై ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయిన‌ట్లు తెలుస్తోంది.  వ‌క్ఫ్ బోర్డుకు చెందిన భూముల‌ను అక్ర‌మంగా అమ్మేశార‌ని ఫారుకిపై యూపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ప్ర‌తిపాదించింది. అయితే త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని ఫారుకి కోర్టును కోరడంతో ఆయ‌న‌కు అద‌న‌పు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని సుప్రీం ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: