ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మంతా సమ్మెల మోత మోగుతోంది. ఆర్టీసీ డ్రైవర్ల హారన్ మోత ముగియకముందే విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె  నేటితో 12వ రోజుకు చేరింది.తెలంగాణ ట్రేడ్ యూనియన్ లో ఉన్న 21 విద్యుత్ సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి.  ఇదే తరుణంలో అటు విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టణ ఉన్నాయి. మంగళవారం విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, విద్యుత్ అధికారులతో యూనియన్ నాయకులు చర్చలు జరిపారు.


 డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు  విఫలమైనందువల్లే సమ్మె నిర్ణయానికి వచ్చామని విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ తెలిపింది. విద్యుత్తు కార్మికులకు సంబంధించి 71 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌ (టీఈటఫ్‌) ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.  ఈ మేరకు 23 తర్వాత మెరుపు సమ్మెకు దిగాలని విద్యుత్ ఉద్యోగులకు ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది. 
 విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్న డిమాండ్ ఉంది.


1999 ఫిబ్రవరి 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి ఈపీఎఫ్ విధానం కూడా అమలుచేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని ట్రాన్స్‌కో జేఎండీ అన్నారు.
దానికి బదులు వారికి బేసిక్ సాలరీతో పాటు మరిన్ని బెనిఫిట్స్ కల్పిస్తామన్నారు.  అయితే కార్మికులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు.


ఈనెల 23వ తేదీ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీఈటఫ్‌ చైర్మన్‌ ఎన్‌.పద్మారెడ్డి, కన్వీనర్‌ శ్రీధర్‌ ప్రకటించారు. చర్చల్లో యాజమాన్యం తరఫున ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్లు (హెచ్‌ఆర్‌) అశోక్‌కుమార్‌ (జెన్‌కో), పర్వతం(ఎస్పీడీసీఎల్‌), డి.వెంకటేశ్వరరావు (ఎన్‌పీడీసీఎల్‌) పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: