హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచుతోంది టిఆర్ఎస్. పొలింగ్ డేట్ దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభను ఏర్పాటు చేసింది గులాబీ పార్టీ. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రేపు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు కేసీఆర్. ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్  ఏ హామీలు ఇస్తారా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 


హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తోంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే సీనియర్ నేతలను హుజూర్ నగర్ కి పంపింది. పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హుజూర్ నగర్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటం...ప్రచారం కీలక దశకు చేరుకోవడంతో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల ప్రచార సభ గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ కావడంతో గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.


గురువారం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో హుజూర్ నగర్ చేరుకుంటారని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచార సభ సుమారు గంటన్నర పాటు ఉండే అవకాశం ఉంది. గులాబీ బాస్ ప్రచార సభను విజయవంతం చేసేందుకు టిఆర్ఎస్ శ్రేణులు శ్రమిస్తున్నాయి. కేసీఆర్ సభ కాబట్టి నియోజకవర్గ నుంచి ప్రజలు భారీగా వస్తారని అంచనా వేస్తూ...అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది టీఆర్‌ఎస్. నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల పరిష్కారంపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని  టిఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి ... తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: