పట్టణశివారుల్లో గ్రీన్ లంగ్‌స్పేస్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన మున్సిపాలిటీ చట్టం అమలుపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కేటీఆర్ ఆదేశించారు.పట్టణాల్లో ఉన్న తాగునీటి వనరుల మదింపు (ఆడిట్) చేయాలని సూచించారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, డీఎంఏ శ్రీదేవి, వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు. చట్టంలో పేర్కొన్నట్టుగా గ్రీన్ యాక్షన్‌ప్లాన్ తయారు చేయాలన్నారు. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు పురపాలిక బడ్జెట్‌లో పదిశాతం కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి పట్టణంలోనూ నర్సరీలను నిర్వహించాలన్నారు.



చెత్తసేకరణ నుంచి రీసైక్లింగ్ వరకు అన్నివివరాలతో ప్రతి పట్టణంలోనూ పారిశుద్ధ్య ప్రణాళికను తయారుచేయాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల మేరకు పురపాలికల్లో పారిశుద్ధ్య కార్మికులు, వాహనాల సంఖ్య ఉండేలా చూడాలని, ప్రతి ఇంటినుంచి తడి, పొడి చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటికే పాత మున్సిపాలిటీల్లో స్వచ్ఛ ఆటోలను అందజేశామని.. ఇంకా అవసరం ఉంటే వాహనాలు, సిబ్బందిని పెంచుకోవచ్చని చెప్పారు. ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి యూనిఫాంతోపాటు అవసరమైన రక్షణ సామగ్రిని సమకూర్చాలన్నారు.  ప్రతి పట్టణానికి సంబంధించిన సమగ్రమైన పారిశుద్ధ్య ప్రణాళిక (సిటీ శానిటేషన్ ప్లాన్) తయారుచేసి, వారం రోజుల్లో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ)కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించేలా ఆయా ఏజెన్సీలను ఆదేశించాలని, పంచాయతీ సిబ్బందికి ఇస్తున్న విధంగానే పురపాలక సిబ్బందికి కూడా ప్రభుత్వ బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని కేటీఆర్ తెలిపారు.



ప్రతి పట్టణంలోనూ డంపింగ్‌యార్డు ఉండాలని, అవి లేనిచోట వెంటనే స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కలెక్టర్లకు సూచించారు. విధిగా డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ (డీఆర్సీ)ను ఏర్పాటుచేయాలన్నారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలు ఓపెన్ డెనకేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) అర్హత సాధించాయని, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లోనూ ఓడీఎఫ్ స్థాయిని అందుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై దృష్టి సారించాలని, అవసరమైనచోట్ల కొత్తవాటిని నిర్మించాలని, మహిళల కోసం ప్రత్యేక షీ- టాయిలెట్లు ఏర్పాటుచేయాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలోని టాయిలెట్లను ప్రజలు ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని, ఈ మేరకు వాటి యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటుచేయాలని సూచించారు. వరంగల్, సిరిసిల్లలో మాదిరిగా ప్రతి పట్టణంలోనూ మానవ వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసుకునే లక్ష్యంగా పనిచేయాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: