తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సాయంత్రం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వలన ఆర్టీసీకి తీవ్రమైన నష్టం వచ్చిందని పేర్కొన్నారు. 150 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయిందని సీఎం తెలిపారు. 
 
ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆర్టీసీ సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండానే సమ్మెకు వెళ్లాయని ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. విధుల్లో గడువులోగా చేరనివారిని మరలా తీసుకునే అవకాశం లేదని అన్నారు. ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని మరిన్ని బస్సులు అద్దెకు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. 
 
న్యాయస్థానంలో ఆర్టీసీ సమ్మె అసంబద్ధమని బలమైన వాదన వినిపించాలని సీఎం చెప్పారు. న్యాయస్థానానికి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఎండీ నియామకం సాధ్యం కాదని, కొత్త ఎండీ గురించి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వివరించాలని సీఎం చెప్పారు. ఆర్టీసీ సంస్థ 5000 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో సంస్థ గురించి, ప్రజల గురించి ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టించుకోకుండా వ్యవహరించాయని అన్నారు. 
 
సమ్మె ద్వారా ఆర్టీసీ కార్మికులు సాధించేది ఏమీ లేదని సీఎం అన్నారు. బస్సుల కోసం వేచి చూసే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని సీఎం చెప్పారు. జర్నలిస్ట్ లు, విద్యార్థులు, ఇతర వర్గాల వారికి ఇచ్చిన బస్ పాస్ లను బస్సుల్లో అనుమతించాలని సీఎం చెప్పారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని, గడువులోగా విధుల్లో చేరని వారిని మరలా తీసుకునే అవకాశం లేదని సీఎం చెప్పటం ఆర్టీసీ కార్మికులకు షాక్ అనే చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: