ససేమిరా అంటున్న కేసీఆర్.. పట్టుబిగిస్తున్నఆర్టీసీ  జేఏసీ అన్న చందంగా తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమ్మె కొనసాగతుంది. సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారానికి పదమూడోరోజుకు చేరింది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు సానుకూల వాతావరణంలో చర్చలు జరుపుకుని సమస్యనుపరిష్కరించుకోవని సూచించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఆర్టీసీ జేఏసీ చర్చలను తాము సిద్ధమని కూడా చెప్పేసింది. మరో పక్క సమ్మె రోజురోజుకు బలోపేతమవుతుంది. ఆర్టీసీ జేఏసీకి క్రమంగా ఇతర ఉద్యోగ, ప్రజా సంఘాల నుంచి మద్దతు కూడా పెరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సమ్మెకు వెళ్లిన కార్మికులతో చర్చలు జరిపేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెగేసి చెప్పారు. సమ్మె నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో రవాణా పరిస్థితిని సీఎం సమీక్షించారు. చర్చల ప్రసక్తే లేదని సీఎం కరాఖండిగా చెప్పడం, ఆ తర్వాత చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించడంతో ఏం చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్‌ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 4 గంటలకు పైగా చర్చించారు.
 
 
 
బస్సులను నూటికి నూరు శాతం తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు హాజరయ్యారు. అదే సందర్బంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా ఆర్టీసీకి ఇప్పుడే కొత్త ఎండి నియామకం అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ పోస్టును సైతం తక్షణమే భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అందుకోసం సమర్థులైన అధికారిని నియమించేందుకు సమావేశంలో కసరత్తు చేశారు. కొత్త ఎండీ ఆధ్వర్యంలో చర్చలు జరపాలా.. లేదా మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి చర్చలు నిర్వహించాలా అన్న దానిపై చర్చ జరిగింది. చివరికి కొత్త ఎండి వద్దని సమావేశం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు ఇచ్చిన దసరా సేవలను అక్టోబర్ 21 వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  సీనియర్‌ ఐపీఎస్‌లైన అకున్‌ సబర్వాల్, స్టీఫెన్‌ రవీంద్ర, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, శివధర్‌రెడ్డి పేర్లను ఆ పోస్టు కోసం పరిశీలించినట్లు సమాచారం.
 
 
 
 
శుక్రవారం కొత్త ఎండీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే చివరికి మంత్రుల కమిటీకే ప్రభుత్వం మొగ్గి చూపినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశిస్తే చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఆర్టీసీ జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఆర్టీసీ నేతలతో ఇప్పటికే ముగ్గురు అధికారులతో కూడిన బృందం తొలి దఫా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మిక జేఏసీ, రాష్ట్ర ప్రభు త్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. చర్చలు జరపాల్సి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు సమాచారం. 
 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: