తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ఓ ప్ర‌ముఖుడికి సంబంధించిన ఆశ్ర‌మాలు స‌హా వివిధ కేంద్రాల‌పై ఐటీ దాడులు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ ఆశ్రమాల్లో ఆదాయం పన్ను శాఖ అధికారులు బుధవారం విస్తృత సోదాలు నిర్వహించడ‌మే ఈ సంచ‌ల‌నానికి కార‌ణం.  కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ, ఆయన వ్యాపార భాగస్వాముల కార్యాలయాలపైనా దాడులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని ఆశ్రమ కార్యాలయాలతోపాటు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ నేప‌థ్యంలో కల్కి భ‌గ‌వాన్ ఎవ‌రు? ఆయ‌న బ్యాక్‌గ్రౌండ్ ఏంట‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.


విజయ్‌కుమార్ నాయుడు...ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ...కల్కి భగవాన్ అంటే చాలా మందికి తెలుసు.దేశవ్యాప్తంగా అనేకమంది సంపన్నులతోపాటు ప్రవాస భారతీయులు కూడా కల్కి భగవాన్‌కు భక్తులుగా ఉన్నారు. అలాంటి వ్య‌క్తి ప్ర‌స్థానం ఆస‌క్తిక‌రం. 1949 మార్చి 7న జన్మించిన ఆయన మొదట ఎల్‌ఐసీలో క్లర్క్‌గా పనిచేశారు. అనంతరం ఉద్యోగం వదిలేసి స్నేహితుడు శంకర్‌తో కలిసి 1984లో చిత్తూరులో స్థాపించిన జీవాశ్రం స్కూల్‌ను నష్టాలు రావడంతో మూసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ 1989లో చిత్తూరులో ప్రత్యక్షమై తనతోపాటు తన భార్యను కూడా దైవాంశ సంభూతిరాలిగా పేర్కొన్నారు. క్రమంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆశ్రమాలను విస్తరించారు.  కల్కి భగవాన్ దంపతుల సాధారణ దర్శనానికి రూ.5 వేలు, ప్రత్యేక దర్శనానికి ఏకంగా రూ.25 వేలు చెల్లించుకోవాల్సినంత క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.


మ‌రోవైపు ఆయ‌న‌పై అనేక వివాదాలు ఉన్నాయి. ఆశ్రమానికి వచ్చిన భక్తులకు మత్తుపదార్థాలు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వినిపించాయి. 2008లో చిత్తూరులోని కల్కి ఆశ్రమంలో తొక్కిసలాట జరుగడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. భూ కబ్జాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010లో విచారణకు ఆదేశించింది. కల్కి ఆశ్రమంలో చాలా మంది ప్రముఖులకు బినామీ ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 


కాగా, ఇలాంటి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలోనే ఐటీ అధికారులు ఏపీలో చిత్తూరు జిల్లా వరదాయపాలెంలోని కల్కి ప్రధాన ఆశ్రమం గోల్డెన్ సిటీలోనూ సోదాలు కొనసాగాయి. తనిఖీలు చేపట్టిన సమయంలో కల్కి భగవాన్, ఆయన భార్య పద్మావతి అందుబాటులో లేరని సమాచారం. కల్కి ఆశ్రమ ట్రస్ట్ మేనేజర్ లోకేశ్ దాసాజీని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐటీ దాడుల్లో వందల కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. చెన్నై నుంగబాకం కార్యాలయంలో కల్కి కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారించినట్లు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: