నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో టీవీ చానళ్లు, పత్రికలు ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేసినా, ప్రచురించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక, అవాస్తవ కథనాలు రాసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలపై ప్రాసిక్యూషన్ కు వెళ్లేందుకు, చర్యలు చేపట్టేందుకు కేబినేట్ అధికారం ఇచ్చింది. 
 
2007 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవాస్తవ, నిరాధార కథనాలు రాసిన సంస్థలపై కోర్టుల్లో కేసులు వేసే విధంగా సమాచార, పౌర సంబంధాల శాఖకు అధికారం ఇచ్చిన జీవో గురించి కూడా కేబినేట్ చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన విధంగా కాకుండా ప్రస్తుతం ఏ శాఖపై వ్యతిరేఖంగా కథనం వస్తే ఆ శాఖ సంబంధిత కార్యదర్శి కేసులు వేసే విధంగా కేబినేట్ తీర్మానించింది. 
 
కొంతమంది మంత్రులు కొన్ని రోజుల క్రితం ఒక పత్రికలో ఆర్టీసీ ఎండీ సురేంద్ర నాథ్ బదిలీ గురించి నిరాధార కథనం వచ్చిందని సీఎంకు చెప్పారు. సంబంధిత శాఖ ఆ వార్తను ఖండించినప్పటికీ ఆ ఖండనకు సరైన ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించలేదని సీఎంకు తెలిపారు. సీఎం జగన్ అధికారులకు అవాస్తవ కథనం ఐతే ఖండన ఇవ్వమని కోరాలని అన్నారు. మీడియా సంస్థలు స్పందించకపోతే మాత్రం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. 
 
సీఎం జగన్ రైతు భరోసాకు అర్హులైన వారు మిగిలి ఉంటే వారిని రైతు భరోసా జాబితాలో చేర్చాలని మంత్రులకు సూచించారు. ఇసుక తవ్వకాలు వరదల వల్ల ఆలస్యం అవుతుందని సీఎం చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం 10 శాతం మాత్రమే మద్యం ధరలు పెరిగాయని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. అందుబాటులో మద్యం ధరలు లేనప్పుడే మద్య నిషేధం సులభంగా అమలు అవుతుందని సీఎం చెప్పినట్లు సమాచారం. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: