తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజుకు చేరింది.  తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులను సమ్మె ఆలోచన విరమించుకోవాలని వారితో చర్చలు జరిపిన త్రిసభ్య కమిటీ కోరింది. ఇక అంతే కాదు డిస్మిస్‌ చేస్తాం. ఎస్మా ప్రయోగిస్తాం. మీ స్థానాల్లో కొత్త వారిని తీసుకుని పోస్టులను భర్తీ చేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేసింది. డిస్మిస్‌ చేసినా, ఎస్మాను ప్రయోగించినా సమ్మెను ఆపేది లేదని ఆర్టీసీ జేఏసీ తెగేసి చెప్పింది. దీంతో రాష్ట్రంలోని 97 డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మిక వర్గాలు విధులను బహిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని డిపోలు, యూనిట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొని, ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు.


ప్రభుత్వం దిగి వచ్చేదాకా సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించిన‌ ఆర్టీసీ కార్మిక జేఏసీ . ఆర్టీసీ సమ్మె పై అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎటు తగ్గకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ కార్మిక సంఘాల తలపెట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మెకు దిగుతున్న కార్మికులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇకపై వారితో చర్చలు ఉండవని తేల్చేసింది. ఆర్టీసీలో పదివేల బస్సులు నడుస్తున్నాయని, ఇందులో 2100 బస్సులు ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులని సీఎం కేసీఆర్‌కి అధికారులు చెప్పారు. మరో ఐదు వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా పని చేయడానికి ముందుకు వచ్చారన్నారు. దీంతో 7వేలకు పైగా బస్సులు నడపడం సాధ్యమతుందని చెప్తున్నారు . ఇక అన్ని రకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విధుల్లో చేరని వారిని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోరాదని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టం చేసింది. ఇక ఈ నేపద్యంలో కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ తమ ఉద్యోగం ఏమవుతుందో అన్న ఆందోళన మాత్రం కొనసాగుతోంది.


ఏది ఏమైన‌ప్ప‌టికీ ఇటు ప్ర‌భుత్వం అటు కార్మికుల మ‌ధ్య సామాన్య ప్ర‌జ‌ల ఇబ్బంది వ‌ర్ణ‌నాతీతం. బ‌స్సులు తిర‌గ‌క దిక్కు తోచ‌క‌ ప్రైవేటు వాహ‌నాలను ఆశ్ర‌యిస్తున్న ప్ర‌జ‌ల‌ను ప్రైవేట్ వాహ‌నాల ఛార్జీలు మోత మోగిస్తున్నారు. అటు విధుల‌కు వెళ్ళ‌డం త‌ప్ప‌క ఇటు ఛార్జీల‌ను భ‌రించ‌లేక ప్ర‌జ‌లు ప‌డే క‌ష్టాలు మాములుగా లేవు.  పవిత్రమైన నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్ర ప్రజలకు మేలుచేయాల్సిన ముఖ్యమంత్రి.. రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం మంచిదికాద‌న్న‌ ఆరోప‌ణ‌లు కూడా విన‌ప‌డుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: